logo

కన్ను పడితే కబ్జానే..

తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు.

Published : 29 Mar 2024 03:59 IST

వినుకొండలో అటవీ, వాగు పోరంబోకు భూముల ఆక్రమణ
రూ.కోట్ల విలువైన స్థలాలు వైకాపా నేతల హస్తగతం  
ఈనాడు డిజిటల్‌-నరసరావుపేట, వినుకొండ రూరల్‌-న్యూస్‌టుడే

తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. జాతీయ రహదారి పక్కన కొంత వాగు భూమిని ఆక్రమించి అందులో మట్టిని తోలి చదును చేశారు. దీనిని అమ్మి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అన్న సామెత మాదిరి వినుకొండ నియోజకవర్గం ముఖ్య ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూములు స్వాహా చేసిన మాదిరి వైకాపా నేతలు ఆయన బాటలోనే పయనిస్తున్నారు. అటవీ, వాగు పోరంబోకు.. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లు సర్కారీ భూములపై గద్దల్లా వాలిపోతున్నారు. వినుకొండ మండల పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూములపై కన్ను పడడం ఆలస్యం వెంటనే ఆక్రమించేశారు. అంతేనా అక్కడితో ఆగకుండా రీసర్వేలో తన పేరుపై పట్టాలు కూడా సృష్టించేశారు. జాతీయ రహదారికి ఆనుకొని ఆక్రమించిన ఈ భూములు ఎకరం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ధర పలుకుతోంది. అధికారమే అండగా రూ.కోట్ల విలువైన భూములను కబ్జా చేసేశారు.

  • తిమ్మాయిపాలెం రెవెన్యూ పరిధిలోని చీకటీగలపాలెం గ్రామం వద్ద వైకాపా నేతకు చెందిన సర్వే భూములను ఆనుకొని 9.70 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. అందులో కొంత భూమిని  ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు.
  • అందుగులపాడు రెవెన్యూ పరిధిలోని 5.50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇది గ్రామం నుంచి కొప్పుకొండకు వెళ్లే దారిని ఆనుకొని ఉంది. దీనిని కొత్తపాలెంకు చెందిన వైకాపా నేత ఒకరు కన్నేశారు. దీనిని సబ్‌ డివిజన్‌ చేసినట్లు రికార్డుల్లో నమోదై ఉంది. దీనికి సంబంధించిన సర్వే నంబర్‌ను వివిధ నంబర్లతో సబ్‌ డివిజన్‌గా మార్చారు.

ర్నూలు-గుంటూరు జాతీయ రహదారి పక్కనే రూ.కోట్ల విలువైన అటవీ భూములపై వైకాపా నేతల కన్నుపడింది. అందుగులపాడు రెవెన్యూ పరిధిలోని 3.80 ఎకరాల అటవీ భూమి ఉంది. వైకాపా మండల స్థాయి మాజీ ప్రజాప్రతినిధి ఒకరు ఈ భూమిని ఆక్రమించి అందులో జామాయిల్‌ తోట సాగు చేస్తున్నాడు. ఆయన పేరున ఖాతా నంబర్‌ 2205గా రెవెన్యూ అధికారులు నమోదు చేశారు. ప్రస్తుతం జరిగిన రీసర్వేలోనూ రెవెన్యూ అధికారులతోపాటు సర్వేయర్‌ సహకరించడంతో ఎల్‌పీ నంబర్లు కూడా కేటాయించారు. పాత రికార్డు ప్రకారం ఇదీ అటవీశాఖకు చెందిన భూమిగా చూపిస్తోంది. అయినా సరే రెవెన్యూ అధికారులు ఏ ప్రాతిపదికన ఈ భూమిని కేటాయించారో ఎవరికీ అర్థం కాని విషయం.


భూ ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చాయి

-తహశీల్దారు

ఎన్నికల బదిలీల్లో భాగంగా ఈ మధ్యనే ఇక్కడకు వచ్చానని, ఆక్రమణలపై ఇంత వరకూ తెలియదని వినుకొండ తహశీల్దారు బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఇటీవలే ఈ ఆక్రమణలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నామని, సిబ్బందితో సర్వే చేయించి, నిజమని నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని