logo

జడ్పీ సర్వసభ్య సమావేశంపై గందరగోళం

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహణపై గందరగోళం ఏర్పడింది.

Published : 16 Apr 2024 05:04 IST

సోమవారం నిర్వహణకు అనుమతి నిరాకరణ
27 లోపు ఏర్పాటు చేయకుంటే పాలకవర్గం కొనసాగింపునకు గండం

గుంటూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం నిబంధనల ప్రకారం ఒక సర్వసభ్య సమావేశం నిర్వహించిన 90 రోజుల్లోపు మరోసారి నిర్వహించకుంటే పాలకవర్గాలు రద్దవుతాయి. ఈ నిబంధన పరిగణనలోకి తీసుకుని జిల్లాపరిషత్తు సీఈవో వసంతరాయుడు ఈనెల 15న సమావేశం నిర్వహించేందుకు ఈనెల 8న నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో కలెక్టరు వేణుగోపాల్‌రెడ్డి అనుమతి కోసం 9న దస్త్రం పంపారు. కోడ్‌ నేపథ్యంలో మే 13న ఎన్నికలు ముగిసిన తర్వాత 15న నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. దాంతో సోమవారం నిర్వహించాల్సిన జడ్పీ 7 స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించలేదు.

సకాలంలో నిర్వహించలేకపోతే..: జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా వైకాపాని వీడి ఈనెల 12న తెదేపాలో చేరారు. ఈ పరిస్థితుల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించకుంటే ఆమె పదవికే ఎసరు వచ్చే అవకాశముంది. జడ్పీ పాలకవర్గంలో 53 మంది వైకాపా జడ్పీటీసీ సభ్యులుండగా.. శావల్యాపురం జడ్పీటీసీ సభ్యురాలు పారా హైమావతి మాత్రమే తెదేపా నుంచి గెలుపొందారు. తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు తన భర్త కత్తెర సురేష్‌కుమార్‌కు వైకాపా అధిష్ఠానం అవకాశం కల్పించకపోవడంతో అసంతృప్తికి గురైన క్రిస్టినా, ఆమె భర్త తెదేపాలో చేరారు. వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమారుడు, పిడుగురాళ్ల జడ్పీటీసీ సభ్యుడు జంగా వెంకటకోటయ్య జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి రెండు నెలలైనా అధికారులు దానిపై నిర్ణయం నిర్ణయం తీసుకోలేదు. జంగా కృష్ణమూర్తి వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరడంతో ఆయన కుమారుడు కూడా వైకాపాకు దూరమయ్యారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్రిస్టినాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఆమె ఎన్నికైన 2022, సెప్టెంబరు 25 నుంచి నాలుగేళ్ల తర్వాతే సాధ్యమవుతుంది. సర్వసభ్య సమావేశాన్ని 90 రోజుల్లోపు నిర్వహించకుంటే పదవీ గండం ఉందని నిపుణులు చెపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 27వ తేదీ లోపు నోటీసు ఇచ్చి అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. క్రిస్టినాను పదవి నుంచి తప్పించేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దీనిని క్రిస్టినా ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని