logo

కలల గృహం.. కల్లోలం

అర్హులైన ప్రతి పేదకు ఇంటి స్థలంతో పాటు గృహాన్ని నిర్మించి ఇచ్చే బాధ్యత మాది. మీరు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తాం.

Published : 02 May 2024 06:43 IST

జగనన్న కాలనీల్లో పూర్తి కాని ఇళ్లు
మధ్యలో ఆగిపోయి లబ్ధిదారుల మానసిక వేదన

ఫిరంగిపురం జగనన్న కాలనీలో మధ్యలో ఆగిపోయిన ఇళ్లు

జిల్లాపరిషత్తు(గుంటూరు), మేడికొండూరు, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి పేదకు ఇంటి స్థలంతో పాటు గృహాన్ని నిర్మించి ఇచ్చే బాధ్యత మాది. మీరు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తాం. మేం నిర్మించుకోలేం.. మీరే ఇల్లు కట్టించండంటే.. మేమే నిర్మించి నూతన ఇంటిని కానుకగా అందజేస్తాం.

 రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వివిధ జిల్లాల పర్యటనలకు వెళ్లినపుడు బహిరంగ సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ఇది.

ఆశల పల్లకీలో లబ్ధిదారులు

గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇంటి స్థలం లేని వారికి సెంటున్నర చొప్పున స్థలంతో పాటు ఇంటి నిర్మాణం, పట్టణాల్లోని పేదలకు సెంటు స్థలం, ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని సీఎం జగన్‌తో పాటు అధికార పార్టీ నాయకులు పలుమార్లు ప్రకటనలు చేయడంతో పేదలు ఆశల పల్లకీలో కలలు గన్నారు. ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేయడంతో నిర్మాణ పనులు కొందరు సొంతంగా ప్రారంభించారు. మరికొందరు నిర్మాణ సామగ్రి తీసుకున్నారు. మూడో కేటగిరిలో ప్రభుత్వమే గుత్తేదారులతో గృహాలు నిర్మిస్తామనడంతో ఎక్కువ మంది ఈ విభాగాన్ని ఎంపిక చేసుకున్నారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఇంటి స్థలం, గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. 58 నెలల వైకాపా పాలన పూర్తయి మళ్లీ సార్వత్రిక ఎన్నికలకు ప్రకటన విడుదలైంది. మరో పక్షం రోజుల్లోపే ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం మాత్రం పేదల గృహాలను నిర్మించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గూడు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

గూడు కోసం తిప్పలు

వైఎస్‌ఆర్‌- జనగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణం యూనిట్‌ వ్యయం రూ.1.80 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాలనీల్లో లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థలాలు మాత్రమే ప్రభుత్వం భూసేకరణ విధానంలో ఇస్తుంది. భూమి అందుబాటులో లేనిచోట కొనుగోలు చేసి గ్రామాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో పేదలకు సెంటు చొప్పున స్థలాలు పంపిణీ చేసింది. ఇంటి నిర్మాణం రూ.1.80 లక్షలతో పూర్తి కావడం లేదు. దాంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి చూపకపోవడంతో గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు డీఆర్‌డీఏ, పట్టణాల్లో మెప్మా ద్వారా రూ.35 వేలు రుణం ఇప్పించింది. మొత్తం లబ్ధిదారుల్లో 60 శాతం మందికి మాత్రమే ఈ రుణాలు అందజేసినట్లు సమాచారం. గ్రామాలకు దూరంగా రెండు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పల్లపు ప్రాంతాల్లోని పంట పొలాలను రైతుల వద్ద కొనుగోలు చేసి లేఅవుట్లు వేశారు. అక్కడ ప్లాట్లు వేసి లబ్ధిదారులకు కేటాయించడంతో పునాదులు తీసి మెరక చేయడానికే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దశల వారీగా లెంటిల్‌, శ్లాబ్‌, రూఫ్‌కాస్ట్‌ దశల్లో నిర్మాణాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. పునాదులు, లెంటిల్‌ దశల్లోనే ఎక్కువ మంది గృహాలు ఆగిపోయాయి. ఇంటి నిర్మాణ పనులు పూర్తవ్వాలంటే రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. పేదల వద్ద అంత మొత్తం లేకపోవడంతో మధ్యలోనే నిర్మాణాలు ఆపేశారు. ప్రభుత్వం కేటగిరి-3లో నిర్మించిన గృహాలు సైతం పూర్తి కాకపోవడం గమనార్హం. వైకాపాకు చెందిన నాయకులు, వారి అనుచరులు నిర్మాణాల బాధ్యతలు తీసుకున్నా అంతులేని జాప్యంంతో ఆలస్యంగా మొదలయ్యాయి. అంతిమంగా లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత గూడు కోసం తిప్పలు పడుతున్నారు.

  • గుంటూరు నగరంలోని పేదలకు పేరేచర్ల, లాం, ఏటుకూరు గ్రామాల్లో పంట పొలాల్లో సెంటు చొప్పున స్థలాలు పంపిణీ చేసి గృహాలను మంజూరు చేసింది. 27,886 మందికి గృహాలను మంజూరు చేస్తే 7,959 మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికీ 2,332 మంది నిర్మాణాలు చేపట్టలేదు.

వాస్తవం ఇదీ

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 58 నెలల పాలన పూర్తయింది. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే జిల్లాలో వైఎస్‌ఆర్‌- జగనన్న కాలనీల్లో ప్రభుత్వం మంజూరు చేసిన గృహాల నిర్మాణాలు పూర్తి కాలేదు. మా గోడు ఇక్కడ పట్టించుకునే వారే లేరంటూ గగ్గోలు పెడుతున్నారు.  

ఇంటి నిర్మాణానికి రూ.లక్షల్లో ఖర్చు

జబోది, మేడికొండూరు

ప్రభుత్వం సెంటున్నర స్థలం ఇచ్చింది. మొదట్లో ఇల్లు కట్టిస్తామంది. కొద్ది రోజులకు లబ్ధిదారులే కట్టుకోవాలని తేల్చిచెప్పారు. రూ.1.8 లక్షలు కేటాయించారు. ఇళ్లు కట్టుకోవాలంటే రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. నేను కూలి పనికి వెళ్తుంటాను. దీనికి తోడు మా అమ్మ అనార్యోగానికి గురైంది. ఖర్చులు పెరిగి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ముందు చెప్పినట్లు ఇల్లు కట్టి ఇస్తే బాగుంటుంది.

అప్పు దొరకటం లేదు:  రావులమ్మ, మేడికొండూరు

అధికారులు ఒత్తిడి చేయడంతో ఇంటి పని మొదలుపెట్టాం. ఇసుక, ఇనుము, సిమెంట్‌ ఉచితంగా ఇచ్చారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో అప్పు చేశాం. పునాది వరకు పూర్తయింది. కొద్ది రోజులకు రూ.48 వేలు మంజూరు చేశారు. వాటితో మొదట్లో చేసిన అప్పు తీర్చాం. మిగితా పని పూర్తి చేస్తే మిగిలిన సొమ్ము వస్తుందని చెప్పారు. చేతిలో డబ్బుల్లేవు. అప్పు దొరకడం లేదు. దీంతో చేసేదేమీ లేకపోవడంతో పని మధ్యలో ఆపేశాం.

ఏమి చేయాలో అర్థం కావడం లేదు

- ఏడుకొండలు, మేడికొండూరు

రెండేళ్ల కిందట ఇంటి పని ప్రారంభించాం. చేతిలో ఉన్న డబ్బులతో పునాది వరకు కట్టాం. కొన్నాళ్లకు రూ.48 వేలు ఇచ్చారు. ఇంటి పని జరిగేటప్పుడు 70 సిమెంటు సంచులు ఇచ్చారు. వర్షానికి తడవడంతో 25 సిమెంటు సంచులు పనికి రాకుండా పోయాయి. మేము కూలి పనికి వెళ్తుంటాం. ఆర్థిక స్థోమత లేదు. మిగిలిన పని పూర్తి చేయాలంటే భారీ ఖర్చవుతుంది. ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మిగితా పని పూర్తి చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని