logo

‘వైకాపాకు వేసే ఓటు మురిగిపోయినట్లే’

ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్‌ కుమార్‌తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్‌షో నిర్వహించారు.

Published : 07 May 2024 06:42 IST

తాడికొండ, న్యూస్‌టుడే: ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్‌ కుమార్‌తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ముక్కామల, మోతడక, నిడుముక్కల, బడేపురం గ్రామాల మీదుగా ప్రచారం సాగింది. పెమ్మసానికి అడుగడుగునా అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్ని వ్యాపారాల యాజమాన్యాలను కీలుబొమ్మల్లా ఆడించారని మండిపడ్డారు. సామాన్యుడి జీవనాన్ని భారంగా మార్చారని, తెదేపా హయాంలో సగటు మధ్య తరగతి కుటుంబం నెలవారీ ఖర్చు రూ.5,000 కాగా.. జగన్‌ రాక్షస రాజ్యంలో అది రూ.20,000కు చేరిందని విమర్శించారు. కరెంటు, బస్సు ఛార్జీలు పెంచి ప్రజల శ్రమను దోచుకున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌ తమ అరాచకాలను ప్రశ్నిస్తున్నాన్న కక్షతో సినీరంగాన్నే దెబ్బతీయాలని చూశారన్నారు. ఐదేళ్లూ సీఎం జగన్‌ ప్రకృతి వనరులను దోచుకొని జేబులు నింపుకొన్నారని దుయ్యబట్టారు. లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల సొమ్మును దోచుకుని తాకట్టు పెట్టేందుకు సిద్ధమాయ్యారని, మరోసారి అధికారం ఇస్తే ప్రజల ఆస్తులను జగన్‌కు అప్పచెప్పినట్లు అవుతుందని పేర్కొన్నారు. సజ్జల రామాకృష్ణారెడ్డి, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలు తమకు అనుగుణంగా చట్టాలు రూపొందించి, ప్రజల ఆస్తులు, హక్కులకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. పల్లెల్లో విద్యుత్‌ దీపాలు, డ్రెయిన్లు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేకపోయిందన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు బహుమతిగా లాఠీ దెబ్బలు ఇచ్చారని, మహిళలన్న కనికరం లేకుండా దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమరావతికి పూర్వ వైభవం వస్తుందని, భారీగా పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వైకాపాలో బీసీలకు విలువ లేదు.. ముక్కామల గ్రామంలో ఏఎంసీ ఛైర్మన్‌ చిమటా పూర్ణచంద్రరావు, సర్పంచి చిమటా వెంకటేశ్వర్లు, సీˆనియర్‌ వైకాపా నాయకుడు చింకా పున్నారావుతోపాటు 50 కుటుంబాల వారు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. వీరికి పెమ్మసాని చంద్రశేఖర్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌ కండువా కప్పి ఆహ్వానించారు. వైకాపాలో బీసీˆలకు విలువ లేదని, పెత్తందారి విధానాలను తట్టుకోలేకే తెదేపాలో చేరామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు