logo

అందని బ్యాలట్లు.. ఉద్యోగుల పాట్లు..

సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్లు అందక పడరాని పాట్లు పడుతున్నారు. సరిపడా బ్యాలట్లు అందుబాటులో ఉంచడంలోనూ అధికారులు విఫలమయ్యారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

Published : 09 May 2024 06:14 IST

4వ రోజూ ఎందుకీ గందరగోళం

గడువు పొడిగించాలని సంఘాల ఆందోళన

 

ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద పోస్టల్‌్ బ్యాలట్‌కు సమయమివ్వాలంటూ నినదిస్తున్న ఐకాస నాయకులు

కలెక్టరేట్‌, పట్టాభిపురం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్లు అందక పడరాని పాట్లు పడుతున్నారు. సరిపడా బ్యాలట్లు అందుబాటులో ఉంచడంలోనూ అధికారులు విఫలమయ్యారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమలో ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఉద్యోగులు ప్రశ్నిస్తే మీరు మీ జిల్లాలకు వెళ్లి ఓట్లు వేసుకోమని చెప్పడంతో వారు అవాక్కయ్యారు.

ఉరుకులు.. పరుగులు

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఫారం-12 ద్వారా పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి వారు సాధారణంగా విధులు నిర్వహిస్తున్న నియోజకవర్గంలోనే ఫెసిలిటేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసి ఓటు వేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల నుంచి ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నా వారి పేర్లను ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు పంపలేదు. తాము దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎందుకు బ్యాలట్లు అందుబాటులో ఉంచలేదని, ఇది ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమేనని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వచ్చిన ఉద్యోగులు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఉరుకులు పరుగులు పెట్టి సొంత నియోజకవర్గానికి వెళ్లి ఓటు వేసి రావాల్సి వచ్చింది. ఆర్‌వోల తీరుతో వారు మండుటెండలో ఓటు ఉన్న నియోజకవర్గాలకు వెళ్లాల్సి వచ్చింది. పోస్టల్‌ బ్యాలట్లు సరిపడా అందకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరికొన్ని పోస్టల్‌ బ్యాలట్లు ముద్రించడానికి ఎన్నికల అధికారులు నిర్ణయించారు. బుధవారం రాత్రికి వాటిని ముద్రించి గురువారం ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు పంపనున్నారు.

దూరప్రాంతాల వారు ఎలా వెళ్లొస్తారు?

ముందుగా దరఖాస్తు చేసుకున్నా ఆయా జిల్లాల నుంచి పోస్టల్‌ బ్యాలట్‌ జిల్లాకు రాకపోవడంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వెళ్లిన వారు బ్యాలట్‌లు లేవని చెప్పడంతో ఆందోళన చెందారు. గురువారం కూడా బ్యాలట్‌ వేసేందుకు అవకాశం ఉన్నందున వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి వేసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. పొరుగు జిల్లాల వారైతే వెంటనే వెళ్లి రావచ్చు. అదే వైజాగ్‌, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని వారు నిలదీస్తున్నారు.

సెల్‌ఫోన్లతోనే లోపలికి..

పోలింగ్‌ కేంద్రంలోకి పలువురు సెల్‌ఫోన్లు యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం.ఈ క్రమంలో సాయంత్రం వేళ తెదేపా, వైకాపా వీఎల్‌ఏల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకొంది. వైకాపా బీఎల్‌ఏ పోలింగ్‌ కేంద్రంలో ఫొటో తీయడం విమర్శలకు దారి తీసింది. ఇదెక్కడి చోద్యమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

 ఓటర్లకు అనుగుణంగా బూత్‌లు లేవు

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు సమయం తక్కువగా ఉందని, దీన్ని పొడిగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. గుంటూరు పశ్చిమలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్ద సమయం పొడిగించాలని జేఏసీ నాయకులు నినదించారు. ఓటర్లకు అనుగుణంగా బూత్‌లను అధికారులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఎవరూ స్పందించడం లేదంటూ వాపోయారు. ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి శెట్టిపల్లి సతీష్‌కుమార్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని