logo

ఇంద ఈ డబ్బులు ఉంచుకో..

జిల్లాలో చీరాల నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడొకరు కొందరికి డబ్బులు ఎరజూపి, ముందస్తుగా కొంత నగదు ముట్టజెప్పి తనకు మద్దతు పలికేలా చేసుకున్నారు.

Published : 09 May 2024 06:15 IST

ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ కొంత నగదు ఇచ్చి ఒప్పందం

అనుకున్న ప్రకారం చెల్లింపులు చేయకుండా నిర్వాకం

చీరాలలో ఓ రాజకీయ నేత తీరుపై స్థానిక నాయకుల ఆవేదన

 

ఈనాడు-బాపట్ల: జిల్లాలో చీరాల నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడొకరు కొందరికి డబ్బులు ఎరజూపి, ముందస్తుగా కొంత నగదు ముట్టజెప్పి తనకు మద్దతు పలికేలా చేసుకున్నారు. ప్రధాన పార్టీని వీడి తన విజయానికి కృషి చేయటానికి వచ్చినందుకు సదరు అభ్యర్థి ఆ నాయకుల స్ధాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ముట్టజెబుతానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా తొలుత ఒక్కో నాయకుడికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని రెండు, మూడు రోజుల్లో సర్దుబాటు చేస్తానని చెప్పి వారికి టోకెన్‌ అడ్వాన్సులు ఇచ్చి వార్డు, గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. తీరా రోజులు గడుస్తున్నా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్దేశిత మొత్తం ఇవ్వకుండా ఆ ఊసేఎత్తకుండా కుశల ప్రశ్నలు వేసి పంపుతున్నారని తామిప్పుడు అటుఇటు కాకుండా మధ్యస్తంగా నలిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ అభ్యర్థిని కాదని మరో అభ్యర్థి వద్దకు వెళదామంటే కొంత నగదు తీసుకున్నామని ఆ మొహమాటం తమకు అడ్డొస్తుందని అలా అని ఇచ్చిన కొద్దిపాటి మొత్తంతో తమ వర్గానికి ఎలా న్యాయం చేయగలమని ప్రశ్నిస్తున్నారు. సదరు అభ్యర్థి రాజకీయంగా సీనియర్‌ కావడం అతన్ని కాదని ఇతరుల వైపునకు వెళితే ఆ పర్యవనసానాలు ఎలా ఉంటాయోనని భయపడి అడ్వాన్సులు తీసుకున్నవారు బిక్కుబిక్కుమంటున్నారు. మొత్తంగా తాము ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతున్నారు. తమ స్థాయికి ఏ అభ్యర్థి అయినా కనీసం రూ.5-6 లక్షలు ఇచ్చి ఓట్లు వేయించాలని కోరేవారని అలాంటిది ఇప్పుడు తమను ఈ అభ్యర్థి తెలివిగా రూ.50 వేల నుంచి ఓ రూ.లక్ష ఇచ్చి చేతులు కట్టిపడేశారని వాపోతున్నారు. వీరిలో చీరాల పట్టణానికి చెందిన వార్డు స్థాయి నాయకులు ఇద్దరు వేటపాలెం మండలానికి చెందిన మరో ఇద్దరు మాజీ సర్పంచులు ఆ అభ్యర్థి నుంచి టోకెన్‌ అడ్వాన్సు తీసుకున్నవారిలో ఉన్నారు. అడ్వాన్సులు ముట్టజెప్పి వారిని ఇతరుల వైపు కన్నెత్తి చూడకుండా చేశారని ఆ విషయం తెలుసుకుని నియోజకవర్గంలోని పలువురు నాయకులు వారికి భలే శాస్తి జరిగిందిలే అని చర్చించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని