logo

బరితెగించిన వైకాపా

గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు.

Published : 10 May 2024 05:26 IST

కుల సంఘాల నేతలకు ప్రలోభాలు
హోటల్‌ కేంద్రంగా బేరసారాలు
ఈనాడు, అమరావతి

గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు. వివిధ కుల సంఘాల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అంతటితో ఆగకుండా వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అక్కడికీ వారు దారిలోకి రాకపోతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ చేతుల్లోనే పవర్‌ ఉంటుందని, అప్పుడు అంతుచూస్తామని హెచ్చరికలు పంపుతున్నారు.

ఉద్యోగులకు బెదిరింపులు..

పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు వేయకుండా ఉద్యోగులు ఉండాలని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తే వారు ఎదురుతిరగడంతో వెనక్కితగ్గారు. కొందరు ఉద్యోగులను పిలిచి పోలింగ్‌ రోజు తమ ఏజెంట్లకు సహకరించాలని, తామే అధికారంలోకి వస్తున్నామని, కోరుకున్నచోట పోస్టింగ్‌ ఇప్పిస్తామని నమ్మకబలికారు. అయితే ఉద్యోగులు పోలింగ్‌ రోజు తాము చేసేదేమీ ఉండదని చెప్పడంతో అందరినీ గుర్తుంచుకుంటామని చెప్పి పంపడం గమనార్హం.

సందిగ్ధంలో పడేసే కుట్ర

నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఓ సామాజిక వర్గం ఓట్లను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాము ప్రస్తుతానికి వైకాపా నుంచి గెలుపొందినా జనసేన అధికారంలోకి వస్తే అటువైపు వస్తామని చెప్పి సదరు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వర్గంలో కీలకమైన వ్యక్తులంతా తమతోనే ఉన్నారని, మీరు కూడా కలిసి రావాలని ఆయా నేతలకు చెబుతున్నారు. ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో అన్నీతానై వ్యవహరించిన కుటుంబ సభ్యుడే ఇక్కడ అన్ని వ్యవహారాలు చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. తప్పుడు ప్రచారం చేసి ప్రతిపక్షాలకు చెందినవారిని సందిగ్ధంలో పడేసి లబ్ధి పొందాలన్న కుట్ర చేస్తున్నట్లు గుర్తించిన తెదేపా అప్రమత్తమైంది. వైకాపా తప్పుడు ప్రచారం ఉచ్చులో పడకుండా కార్యకర్తలు, నేతలకు స్పష్టత ఇచ్చింది.

అంతా అక్కడే..

నియోజకవర్గంలో పోటీ ఖరారైన వెంటనే గుంటూరు నగరంలో ఓ ప్రముఖ హోటల్‌ కేంద్రంగా రాజకీయం ప్రారంభించారు. రెండు నెలల నుంచి అక్కడే మకాం వేసి నేతలను పిలిపించుకుని వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నారు. తెదేపాకి బలమైన నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతో ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడమని సంకేతాలు ఇస్తున్నారు. కూటమిలోని తెదేపా, జనసేన, భాజపా నేతల్లో అసంతృప్తిగా ఉన్నవారిని గుర్తించి మీరు నేరుగా పార్టీలో చేరకపోయినా తమకు పనిచేయాలని కోరుతున్నారు. ఎవరెవరికి ఏయే వ్యాపారాలు ఉన్నాయి? ఎవరిచేత చెప్పిస్తే పని సులభమవుతుందన్న ధోరణిలో వెళుతున్నారు. ఇప్పటికే వివిధ సామాజికవర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి బహుమతులు అందించారు. ఎన్ని ఎత్తులు వేసినా విజయంపై భరోసా కలగకపోవడంతో అంతిమంగా పెద్దఎత్తున నగదు పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు