logo

సూపర్‌-6తో భవిష్యత్తు గ్యారెంటీ

‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ నివసిస్తున్న వివిధ వృత్తుల వారు చేసే పనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆదాయం పెరిగేలా చేస్తాం. ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసి అక్కడ పని చేసుకోవడానికి అన్ని వసతులు..

Updated : 10 May 2024 06:21 IST

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే, మంగళగిరి

‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ నివసిస్తున్న వివిధ వృత్తుల వారు చేసే పనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆదాయం పెరిగేలా చేస్తాం. ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసి అక్కడ పని చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించి వృత్తులవారికి తగిన ప్రాధాన్యత ఇస్తాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి  నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

పేదరికం లేని నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్ది.. దేశంలోని 4వేల నియోజకవర్గాల్లోనే ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తామని, ‘సూపర్‌-6’ పథకాలతో వివిధ వర్గాలకు చేకూరే ప్రయోజనాలు, మహిళాఅభ్యున్నతికి చేపట్టే చర్యలు, యువతకు ఉపాధి తదితర అంశాలను ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు.


గోల్డ్‌ హబ్‌గా ఏర్పాటు.. చేనేతకు చేయూత

మంగళగిరి నియోజకవర్గంలో 50 నుంచి 100 ఎకరాల్లో ప్రత్యేక సెజ్‌ ఏర్పాటు చేస్తాం. గోల్డ్‌ వర్క్‌కు సంబంధించి ఆధునిక డిజైన్ల తయారీకి మంగళగిరిని హబ్‌గా మారుస్తాం. డైమండ్ల తయారీలో శిక్షణ ఇప్పించి ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాం. దీనివల్ల 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

  • ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. చేనేత కార్మికులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వస్త్ర రంగంలో ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని మార్కెట్‌ను విస్తృతం చేస్తాం. తద్వారా చేనేత కార్మికుల ప్రగతికి చర్యలు చేపడుతాం.

వీటి వల్ల నియోజకవర్గంలో ఉన్న సుమారు 18వేల మంది స్వర్ణకారులు, సుమారు 65 వేల మంది చేనేత కార్మికులకు భరోసా లభిస్తుంది. స్టార్టప్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తాం.


ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు.. చెత్త పన్ను రద్దు

నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల జీవనం దుర్భరమైంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చి కట్టెల పొయ్యి నుంచి ఉపశమనం కలిగిస్తాం.

  • చెత్తపై పన్ను రద్దు చేస్తాం. కేంద్రం అమలు చేస్తున్న సోలార్‌ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి పథకాన్ని అనుసంధానం చేసి విద్యుత్తు బిల్లుల భారం తగ్గేలా చూస్తాం.
  • పెట్రోలు, డీజిల్‌ ధరలు నియంత్రించడం వల్ల వస్తువుల ధరలు తగ్గుతాయి. ఉచిత ఇసుక విధానంతో ఇంటి నిర్మాణ భారం తగ్గిస్తాం.
  • ఇప్పటికే సొంత నిధులతో అమలు చేస్తున్న 29 సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించి పేదలు ఆర్థికంగా ఎదిగేలా చేస్తాం.
  • నియోజకవర్గంలో 3.69 లక్షల జనాభా, సుమారు 1.02 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ ఈ పథకం వల్ల ఉపశమనం లభిస్తుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

ప్రతి కుటుంబంలో 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు సాయం అందిస్తాం. ఆడపడుచులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు తీసుకువస్తాం.

  • వారు ఆర్థికంగా ఎదిగేందుకు పీ-4 విధానం అమలు చేస్తాం. స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణం రూ.10 లక్షల వరకు ఇస్తాం.
  • ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పిస్తాం. విద్యార్థినులకు చదువులకు అవసరమైన రుణాలు ఇప్పిస్తాం.
  • నియోజకవర్గంలో మహిళలకు ఆసక్తి ఉన్న రంగంలో నిపుణులతో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి కుట్టుమిషన్లు, తోపుడుబండ్లు ఇలా వారికి అవసరమైన పరికరాలు అందించి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం.
  • నియోజకవర్గంలో సుమారు 1.82 లక్షల మంది మహిళలు.. ఈ పథకాల ద్వారా వారి కాళ్లపై వారు నిలబడతారు.

రూ.4 వేల పింఛను...ఏప్రిల్‌ నుంచే వర్తింపు

సామాజిక భద్రతకు తెదేపా తొలినుంచి ప్రాధాన్యత ఇస్తోంది. రూ.200లు ఉన్న పింఛను రూ.2వేలకు పెంచిన ఘనత మాదే. దీన్ని రూ.4 వేలకు పెంచుతాం.

  • దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తి వైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు రూ.10వేల పింఛను అందిస్తాం.
  • మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వస్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి అక్కడే పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తాం. ఇంటిస్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటాం.
  • నియోజకవర్గంలో 91 వేల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతారు.

నిరుద్యోగులకు రూ.3 వేల భృతి.. మెగా డీఎస్సీ

మా ప్రభుత్వంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అమలుచేస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి యువకుడికి నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటాం.

  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తాం. అత్యధికంగా ఉద్యోగాలకు అవకాశం ఇచ్చే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి ప్రోత్సాహం కల్పించబోతున్నాం.
  • ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం.
  • యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
  • నియోజకవర్గంలోని 1.05 లక్షల మందికి ఈ పథకాలు భరోసాగా నిలుస్తాయి.

బీసీలకు రక్షణ చట్టం.. ‘ఆదరణ’ పథకం పునరుద్ధరణ

యువగళం పాదయాత్రలో ప్రజల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాను. అన్నివర్గాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. పీ-4 విధానం ద్వారా పేదరికం నుంచి ప్రజలను విముక్తులను చేస్తాం.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తాం.

  • బీసీల రక్షణకు ప్రత్యేక చట్టంతోపాటు స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో రిజర్వేషన్లు ఇస్తాం.  ఆదరణ పథకం ద్వారా వెనుకబడినవర్గాలకు పనిముట్లు అందజేస్తాం.
  • వార్షిక ఆదాయం రూ.50 వేల కంటే తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం.
  • ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం అందిస్తాం. హ్యాండ్లూమ్‌లకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తాం.
  • దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల్ని భర్తీ చేస్తాం.
  • క్రిస్టియన్‌ మిషనరీల ఆస్తుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాం. చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సహాయం అందిస్తాం.
  • నియోజకవర్గ పరిధిలోని సుమారు లక్ష మంది బీసీలు, 96,000 మంది ఎస్సీ, ఎస్టీలకు ఈ కార్యక్రమాల ద్వారా ఉపశమనం కలుగుతుంది.

హజ్‌ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం

వైకాపా రద్దుచేసిన సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తాం. మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తాం. మహిళలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం. ఈద్గాలు, ఖబరస్థాన్‌కు స్థలాల కేటాయిస్తాం.

  • ఇమామ్‌లకు ప్రతి నెల రూ.10 వేలు, మౌజమ్‌ రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తాం. అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తాం.
  • మసీదు నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేలు ఆర్థిక సహాయం, హజ్‌ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ. లక్ష సహాయం చేస్తాం. క్రిస్టియన్‌ మిషనరీల ఆస్తుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాం.  

ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు..

ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. రావలసిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేస్తాం.

  • ఉద్యోగులు, ఉపాధ్యాయుల గౌరవాన్ని పునఃప్రతిష్టించి అనుకూల వాతావరణంలో పనిచేసేలా చర్యలు తీసుకుంటాం.
  • ఉపాధ్యాయులకు యాప్‌ల నుంచి ఉపశమనం కల్పిస్తాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇవ్వడంతోపాటు ఐఆర్‌ అందిస్తాం. సీపీఎస్‌/జీపీఎస్‌ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం.
  • తక్కువ జీతాలు పొందే అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపజేస్తాం. వాలంటీర్ల గౌరవ వేతనం నెలకు రూ.10 వేల చొప్పున ఇస్తాం.

సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్తు

మంగళగిరి నియోజకవర్గంలో మల్లెపూలు, మొక్కజొన్న, పసుపు విస్తారంగా సాగుచేస్తారు. వీటిని ముడిపదార్థాలుగానే రైతులు విక్రయిస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదు. వీటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేయవచ్చు. దీని వల్ల గిట్టుబాటు ధరలు రావడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేసి రైతులు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. రాయితీపై వ్యవసాయ పరికరాలు అందిస్తాం.
  • వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తాం.
  • కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రాయితీ పథకాలు అందేలా చూస్తాం.
  • ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తాం.
  • దీని ద్వారా నియోజకవర్గంలోని సుమారు 79 వేల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుతుంది.

  • రైతుకు ఏటా రూ.20వేల ఆర్థిక సాయం
  • మహిళకు నెలకు రూ.1500
  • బడికి వెళ్లే విద్యార్థికి ఏడాదికి రూ.15,000
  • బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్‌
  • చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు  
  • డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణం  
  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు
  • పేదరికం లేని మంగళగిరే లక్ష్యం
  • ‘ఈనాడు’తో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు