logo

హృద్రోగంతో ఇష్టమైన ఆటకు దూరం

అతనికి చిన్న తనం నుంచి ఫుట్‌బాల్‌ క్రీడ అంటే ప్రాణం. తండ్రి మత బోధకుడు. కుమారుడిని గొప్ప క్రీడాకారుడిగా చూడాలనే కోరికతో నిత్యం ప్రోత్సహించేవాడు. అందుకు తగ్గట్టే అతను చాలా ఫుట్‌బాల్‌ పోటీల్లో దేశం తరపున పాల్గొన్నాడు. ఇంతలోనే విధి దెబ్బతీసింది.

Published : 11 Feb 2022 06:44 IST

 ఉగాండా క్రీడాకారుడి దీన గాథ 

ప్రాణాలు కాపాడిన నగర వైద్యులు

సర్జరీ అనంతరం క్రీడాకారుడు జోసెఫ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అతనికి చిన్న తనం నుంచి ఫుట్‌బాల్‌ క్రీడ అంటే ప్రాణం. తండ్రి మత బోధకుడు. కుమారుడిని గొప్ప క్రీడాకారుడిగా చూడాలనే కోరికతో నిత్యం ప్రోత్సహించేవాడు. అందుకు తగ్గట్టే అతను చాలా ఫుట్‌బాల్‌ పోటీల్లో దేశం తరపున పాల్గొన్నాడు. ఇంతలోనే విధి దెబ్బతీసింది. తీవ్రమైన హృద్రోగం ఇష్టమైన క్రీడనే దూరం చేసింది. తూర్పుఆఫ్రికా దేశం ఉగాండాకు చెందిన ఓక్వారా జోసెఫ్‌(31) అనే క్రీడాకారుడి దీన గాథ ఇది. ఇటీవలే నగరంలోని యశోద ఆసుపత్రిలో క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు పునర్జన్మ ఇచ్చారు. వివరాలను గురువారం ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి మీడియాకు తెలిపారు. ఓక్వారా జోసెఫ్‌ గతేడాది ఏప్రిల్‌లో ఫుట్‌బాల్‌ ఆడుతుండగా.. ఒక్కసారిగా ఛాతి ఎడమ వైపు తీవ్రమైన నొప్పి వచ్చింది. తోటి క్రీడాకారులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు అతనికి ఇస్కీమిక్‌ కార్డియోమయోపతి అని నిర్ధారించారు. గుండె ఎడమ జఠరికలో సమస్య ఉన్నట్లు తేలింది. దీని శరీర భాగాలకు రక్త సరఫరాలో ఇబ్బందులున్నట్లు గుర్తించారు. అక్కడే పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. స్నేహితుల సూచనతో హైదరాబాద్‌లోని యశోద వైద్యులను సంప్రదించారు. గతేడాది నవంబరులో ఇక్కడికి వచ్చాడు. పరిశీలించిన వైద్యులు అతనికి ఎడమ జఠరిక సహాయ పరికరం(లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ సిస్టమ్‌-ఎల్‌బీఏడీ) అమర్చాలని నిర్ణయించారు. ఇది గుండెలోని ఎడమ జఠరిక నుంచి రక్తాన్ని తీసుకొని బృహద్ధమనికి, శరీర భాగాలకు రక్తం సరఫరా చేస్తుంది. పంపు యూనిట్‌ ఛాతిలో ఉంచుతారు. బయట కంట్రోల్‌ సిస్టమ్‌ ఉంటుంది. క్లిష్టమైన బైపాస్‌ సర్జరీతో ఓక్వారా జోసెఫ్‌కు ఈ పరికరం అమర్చామని డాక్టర్‌ పవన్‌ తెలిపారు. తాత్కాలికంగా ప్రాణాపాయం నుంచి ఎల్‌బీఏడీ సహాయపడుతుందన్నారు. కొన్నాళ్లకు గుండె కోలుకునే అవకాశం ఉందని, లేదంటే దాత దొరికితే గుండె మార్పిడి చేసుకునే వీలుందని తెలిపారు. జోసెఫ్‌ పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని