KTR: లండన్ నుంచి కావేరి వరకు సేవ్ సాయిల్ ర్యాలీ.. సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కేటీఆర్‌ చిట్‌చాట్‌

ప్రపంచవ్యాప్తంగా భూమి తన సారాన్ని కోల్పోతోందని.. ఈ సమస్యతో త్వరలోనే ఆహార కొరత ఎదుర్కొనే ప్రమాదం ఉందని సద్గురు జగ్గీవాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు అన్ని ప్రభుత్వాలు అత్యంత వేగంగా శ్రీకారం చుట్టాల్సిన అవసరం...

Updated : 24 May 2022 21:43 IST

దావోస్‌: ప్రపంచవ్యాప్తంగా భూమి తన సారాన్ని కోల్పోతోందని.. ఈ సమస్యతో త్వరలోనే ఆహార కొరత ఎదుర్కొనే ప్రమాదం ఉందని సద్గురు జగ్గీవాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు అన్ని ప్రభుత్వాలు అత్యంత వేగంగా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ సద్గురుతో సంభాషణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ‘‘సేవ్ సాయిల్’’ పేరుతో అవగాహనా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న జగ్గీవాసుదేవ్... ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు సందర్భంగా వివిధ కంపెనీలను కలిసి తన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ కంపెనీలతోనూ సమావేశమవుతున్నారు.

దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో సద్గురుతో మంత్రి కేటీఆర్ సంభాషించారు. తాను చేపట్టిన సేవ్ సాయిల్ కార్యక్రమం ప్రాధాన్యతను సద్గురు వివరించారు. ‘‘రానున్న 2, 3 దశాబ్దాల్లో ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉంది. ఇప్పటినుంచి భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం లండన్ నుంచి కావేరి వరకు సేవ్ సాయిల్ ర్యాలీ చేపట్టి ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేస్తున్నాను’’ అని సద్గురు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పర్యావరణ అనుకూల కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వివరించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నాల్లో ఒకటైన హరితహారం సహా వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులు పెంపునకు కృషి చేస్తున్నాం. భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చకుంటే వ్యవసాయ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది.  సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ ర్యాలీ అద్భుతమైన కార్యక్రమం. కార్యక్రమం విజయవంతం కావాలి’’ అని కేటీఆర్‌ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సద్గురు జగ్గీవాసుదేవ్‌ను కేటీఆర్‌ హైదరాబాద్‌కు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన కార్యక్రమాలను ప్రశంసించారు.  వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, ప్రజలు కలిసి రానున్న భవిష్యత్ తరాలకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగేలా వ్యవసాయ నేలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తమతో కలిసి రావాలని సద్గురు పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని