logo

గోల్కొండ కోట.. భక్తులతో కిటకిట

వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో గోల్కొండ కోట పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. యువకుల కేరింతలు.. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల వీరంగాలు.. వెరసి గోల్కొండ కోటలో జగదాంబికా అమ్మవారికి ఆదివారం రెండో పూజ అంగరంగ వైభవంగా జరిగింది.

Published : 04 Jul 2022 03:57 IST

గోల్కొండ, న్యూస్‌టుడే: వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో గోల్కొండ కోట పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. యువకుల కేరింతలు.. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల వీరంగాలు.. వెరసి గోల్కొండ కోటలో జగదాంబికా అమ్మవారికి ఆదివారం రెండో పూజ అంగరంగ వైభవంగా జరిగింది.

జగదాంబికా అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు

ప్రత్యేక పూజలు..

అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దాదాపు 50వేల మంది కోటకు చేరుకుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురావస్తుశాఖ అధికారులు భక్తులను కోటలోకి ఉచితంగా అనుమతించారు. మహిళలు బోనం కుండలతో ఊరేగింపుగా కోటపైకి సాగారు.  


దిల్లీకి బంగారు బోనం

బోనంతో దిల్లీకి వెళుతున్న ఆలయ కమిటీ ప్రతినిధులు

చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళీ దేవాలయ కమిటీ దిల్లీలో బోనాల ఉత్సవాలు నిర్వహించడానికి ఆదివారం పయనమైంది. కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు బోనంతో ఆలయం నుంచి లాల్‌దర్వాజా మోడ్‌ వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలులో దిల్లీకి బయలుదేరారు. ఈనెల 5న తెలంగాణ భవన్‌లో బోనాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం, ఎదుర్కోలు, 6న ఇండియా గేట్‌ నుంచి తెలంగాణ భవన్‌ వరకు బంగారు బోనంతో ఊరేగింపు, అమ్మవారికి బోనాల సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధి రాజ్‌కుమార్‌ తెలిపారు.


కనకదుర్గమ్మకు సమర్పణ..

దుర్గగుడి ఈవోకు బంగారు బోనం ఇస్తున్న ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు

విజయవాడ: భాగ్యనగర్‌ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనాన్ని సమర్పించారు. వీరి నుంచి బోనాన్ని దేవస్థానం ఈవో భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులకు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. కమిటీ అధ్యక్షులు రాకేష్‌ తివారి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని