logo

మహిళలకు వలేస్తూ.. నగలు కాజేస్తూ

పోలీసునని చెబుతాడు... మహిళలకు వలవేస్తాడు... ఆపై వారి ఒంటిపైనున్న నగలను దోచేస్తాడు. వరుస నేరాలకు పాల్పడుతున్న ఆ అంతర్రాష్ట్ర నేరస్థుడిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. పోలీసుల కథనం ప్రకారం...

Published : 10 Aug 2022 02:47 IST

నకిలీ పోలీసు అరాచకాలు

నాగోలు, న్యూస్‌టుడే: పోలీసునని చెబుతాడు... మహిళలకు వలవేస్తాడు... ఆపై వారి ఒంటిపైనున్న నగలను దోచేస్తాడు. వరుస నేరాలకు పాల్పడుతున్న ఆ అంతర్రాష్ట్ర నేరస్థుడిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మేకల సాయికుమార్‌(25) బీటెక్‌ చదివాడు. కొన్నాళ్లు సొంతూరులోనే ఓ ఇన్‌స్పెక్టర్‌ వద్ద డ్రైవరుగా పనిచేశాడు. అనంతరం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సులో చేరేందుకు శిక్షణ తీసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కానీ... తాను కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నానంటూ బీరాలు పోతాడు. ఇటీవల పిడుగురాళ్ల నుంచి నగరానికి బస్సులో బయలుదేరిన ఓ మహిళను మచ్చిక చేసుకున్నాడు. తన సోదరిలాగే ఉన్నావంటూ ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. చర్లపల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానంటూ నమ్మించాడు. మధ్యలో తమ సీఐ, డీఎస్పీలతో ఫోనులో మాట్లాడుతున్నట్లు పోజిచ్చాడు. ఓ కేసులో బంగారం రికవరీ చేయనందుకు తమ సీఐ తనను సస్పెండ్‌ చేస్తానంటున్నాడంటూ కథ అల్లాడు. ఎల్బీనగర్‌లో బస్సు దిగి ఆ మహిళతో కలిసి ఆటోలో ఎక్కాడు. ఆమె ఒంటిపైనున్న నగలను తీసిస్తే వాటిని వీడియోకాల్‌లో చూపి.. అప్పటికి తన ఉద్యోగాన్ని కాపాడుకుంటానంటూ వేడుకున్నాడు. దీంతో అమాయకురాలైన ఆ మహిళ మెడలోని గొలుసుతోపాటు ఉంగరాలు తీసి అతడి చేతిలో పెట్టింది. ఆటో దిగి వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అక్కడినుంచి జారుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతె కేసు నమోదు చేసిన  పోలీసులు సోమవారం అన్నవరం వెళ్లి అరెస్టుచేసి నగలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో రాజమండ్రి, మాదాపూర్‌, గుంటూరు, వైజాగ్‌లో ఈ తరహా నేరాలకు పాల్పడ్డాడు. ఓ మహిళను ప్రేమ పేరిట మోసగించి నగలు దోచుకెళ్లాడు. సన్నిహితంగా మెలిగిన విషయాలు బయటపడతాయనే భయంతో వారు చోరీ విషయం చెప్పరని నిందితుడి పన్నాగం. 2019లో మోసపోయిన ఓ యువతి అట్రాసిటీ కేసు పెడితే ఆమెతో రాజీకి వచ్చి పెళ్లిచేసుకున్నాడు. పోలీసునని బెదిరిస్తూ ఆటోడ్రైవర్ల వద్దనున్న సెల్‌ఫోన్ల చోరీలకూ సదరు నేరస్థుడు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు