Kangana Ranaut: చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్‌పై స్పందించిన కంగనా

ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు.

Published : 07 May 2024 23:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా భాజపా తరఫున పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆమె ఇక సినిమాలు మానేస్తున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై కంగనా స్పష్టతనిచ్చారు.

‘ఎన్నికల తర్వాత నేను సినిమాలు మానేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఇండస్ట్రీలో కొనసాగుతాను. ఎందుకంటే చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి’ అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. సినిమాలు పరాజయం కావడం వల్లే కంగనా పాలిటిక్స్‌లోకి వెళ్లారనే వార్తలపై కూడా ఇటీవల ఆమె స్పందించారు. ‘ఫ్లాపులు లేకుండా కేవలం హిట్స్‌ మాత్రమే అందుకున్న నటీనటులెవరూ ఈ ప్రపంచంలో లేరు. కెరీర్‌ ఆరంభంలో నేను నటించిన ఏ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆడలేదు. దాదాపు ఎనిమిదేళ్లు ఫ్లాప్స్‌ చూశా. ఆ సమయంలో ‘క్వీన్‌’ విడుదలతో సక్సెస్‌ దక్కింది. ఆ తర్వాత వరుసగా కొన్ని విజయాలు చూశా. త్వరలో ‘ఎమర్జెన్సీ’ రానుంది. అది విజయం సాధిస్తుందన్న నమ్మకముంది’ అన్నారు.

టాప్‌ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కంగనా.. ‘ఎమర్జెన్సీ’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. 2019లో విడుదలైన ‘మణికర్ణిక’ తర్వాత ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా రానున్న ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన ఆస్తులన్నింటినీ తనఖా పెట్టి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించగా.. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జూన్‌ 14న ఈ చిత్రం విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని