logo
Published : 11 Aug 2022 03:59 IST

యూట్యూబ్‌లో చూసి.. బ్యాంకును ముంచేసి

రూ.1.33 కోట్లు మోసం చేసిన బృందం

నలుగురి అరెస్ట్‌

నిందితులు బోడ శ్రీకాంత్‌, భూక్యా నగేశ్‌, గుడ్డేటి గౌతమ్‌, బానోత్‌ సుమన్‌

ఈనాడు, హైదరాబాద్‌, నాగోల్‌, న్యూస్‌టుడే: సులభంగా డబ్బు సంపాదించడం ఎలాగో యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేర్చుకున్న ఓ వ్యక్తి.. మరో నలుగురితో కలిసి ఐసీఐసీఐ బ్యాంకును రూ.1.33 కోట్ల మేర మోసం చేశాడు. నకిలీ సంస్థ ఏర్పాటు చేసి లేని ఉద్యోగుల పేరుతో క్రెడిట్‌ కార్డులు తీసుకుని వాటి ద్వారా డబ్బు లాగేశాడు. ఈ సొమ్ముతో ఎండీవర్‌, ఫోక్స్‌వ్యాగన్‌ కార్లు, రూ.44 లక్షలతో ఇంటిని కొనుగోలు చేశాడు. ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదుతో మల్కాజిగిరి ఎస్‌వోటీ, నాచారం పోలీసులు.. ప్రధాన నిందితుడు బోడ శ్రీకాంత్‌ను, అతనికి సహకరించిన బానోత్‌ సుమన్‌, భూక్యా నగేశ్‌, గుడ్డేటి గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు యడ్ల భిక్షపతి మరణించాడు. నిందితుల నుంచి ఫోక్స్‌ వ్యాగన్‌ కారు, 93 డెబిట్‌ కార్డులు, 3 క్రెడిట్‌ కార్డులు, 54 ఆధార్‌కార్డులు, 28 పాన్‌కార్డులు, 17 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం వెల్లడించారు.

53 మంది నకిలీ ఉద్యోగులతో

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ తండాకు చెందిన బోడ శ్రీకాంత్‌ కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో ఉంటున్నాడు. డిప్లొమా చేసిన అతను సులభంగా డబ్బు సంపాదించడానికి ఘరానా మోసాలకు దిగాడు. లివింగ్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌ పేరిట మేడిపల్లి సత్యనారాయణపురంలో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. తన ఊరికి సమీపంలో ఉండే బానోత్‌ సుమన్‌, యడ్ల భిక్షపతికి బ్యాంకు రుణం ఇప్పిస్తానంటూ వారి ఆధార్‌కార్డుల ద్వారా పాన్‌కార్డులు తయారు చేయించాడు. నకిలీ సంస్థకు సుమన్‌, భిక్షపతిని యజమానులుగా చూపించాడు. తన గ్రామానికి సమీపంలోని కొందరు యువకులు, గృహిణులకు తక్కువ వడ్డీకి రుణాలిప్పిస్తానంటూ ఆధార్‌కార్డులు సేకరించి వారంతా (53 మంది) తన సంస్థలో పనిచేస్తున్నారంటూ హబ్సిగూడ, ఉప్పల్‌, రామంతాపూర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బందిని నమ్మించి వేతన ఖాతాలు తెరిపించాడు. అనంతరం వారిపేర్లతో క్రెడిట్‌ కార్డులు తీసుకున్నాడు. మొబైల్‌ సందేశాలు వచ్చేలా సిమ్‌కార్డులు తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒక్కో ఖాతాలో నెలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వేసి.. తర్వాత తీసుకునేవాడు. దీంతో 34 మంది క్రెడిట్‌ కార్డులకు రుణ పరిమితిని బ్యాంకు పెంచింది. వాటి ద్వారా రూ.1,33,65,000 విత్‌డ్రా చేశాడు. ఒక్కో కార్డు ద్వారా రూ.10 లక్షలు తీశాడు. ఆ డబ్బుతో ఫోర్డ్‌ ఎండీవర్‌, ఫోక్స్‌వ్యాగన్‌ కార్లు కొన్నాడు. క్రెడిట్‌కార్డుల బిల్లులు కట్టకుండా రెండేళ్లు బ్యాంకులకు టోకరా వేశాడు. దీనిపై హబ్సిగూడ ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ శ్యామ్‌ సుంకర జులై 24న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నట్లు కమిషనర్‌ తెలిపారు. అదే సమయంలో శ్రీకాంత్‌ నారపల్లిలో యెల్లో ల్యాంప్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌, మణికొండలో బ్రిక్‌ రాక్‌ అండ్‌ ఇంటీరియర్స్‌ పేరుతో సంస్థలు ఏర్పాటు చేసి హెచ్‌డీఎఫ్‌సీ, యెస్‌ బ్యాంకులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్ని వేగంగా గుర్తించిన మల్కాజిగిరి ఎస్‌వోటీ సీఐ అశోక్‌రెడ్డి, నాచారం పోలీసుల్ని మహేశ్‌ భగవత్‌ అభినందించారు.


రూపం మార్చుకునే ప్రయత్నం!

ఐసీఐసీఐ బ్యాంకును మోసం చేసి అప్పనంగా దోచిన డబ్బును జల్సాలకు ఖర్చు చేసిన ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌.. తన రూపం మార్చుకునేందుకూ ప్రయత్నించాడు. ఒకేసారి బరువు తగ్గడానికి తొలుత కఠినమైన కసరత్తులు చేశాడు. ఫలితం లేకపోవడంతో ప్రత్యేకంగా చికిత్స తీసుకున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడినా గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఈ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని