logo

అద్దె కట్టడు.. ఖాళీ చేయడు

అద్దె కట్టకుండా, ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టిన ఓ కిరాయిదారుకు, వృద్ధుడైన యజమాని మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించి రెండేళ్లుగా కట్టని మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించడంతోపాటు...

Published : 17 Aug 2022 01:54 IST

2 కేసులను పరిష్కరించిన లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ

ఈనాడు, హైదరాబాద్‌: అద్దె కట్టకుండా, ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టిన ఓ కిరాయిదారుకు, వృద్ధుడైన యజమాని మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించి రెండేళ్లుగా కట్టని మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించడంతోపాటు నెలకు రూ.50 వేల చొప్పున అద్దె చెల్లించేలా సిటీ సివిల్‌కోర్టు న్యాయసేవాధికార సంస్థ సయోధ్య కుదిర్చింది. నగరానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడికి చెందిన వాణిజ్య స్థలంలో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా అద్దెకుంటున్నాడు. రెండేళ్లుగా అద్దె చెల్లించకుండా ఖాళీ చేయకుండా వృద్ధుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. నిస్సహాయతతో ఉన్న ఆ వృద్ధుడు న్యాయసేవాధికార సంస్థ గురించి తెలుసుకుని అక్కడ ఫిర్యాదు చేశారు. న్యాయసేవాధికార సంస్థ చొరవ చూపి ఇరుపక్షాలతో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశారు. రెండేళ్లుగా చెల్లించని అద్దె డబ్బును పూర్తిగా చెల్లించడంతోపాటు ఇకపై నెలకు రూ.50 వేల అద్దె చెల్లించేందుకు అంగీకరించారు. మరోకేసులో బీమా పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సంస్థకు, ఓ కుటుంబానికి మధ్య సయోధ్య కుదిర్చి రూ.80 లక్షల బీమా పరిహారం అందే ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో బీమా పాలసీ తీసుకున్నారు. ప్రమాదవశాత్తు అతను మరణించగా క్లెయిమ్‌ కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. పరిహారం రాకపోయేసరికి న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించారు.  ఇరుపక్షాలను విచారించి రాజీకి ఒప్పించడంతో బీమా సంస్థ రూ.80 లక్షలు చెల్లించేందుకు అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని