ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి

వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి.

Updated : 27 Apr 2024 06:27 IST

ఈనాడు - హైదరాబాద్‌ 

వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. ఇక ప్రయాణాలను మనం ఊహించగలమా..? అందుకే దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను గణనీయంగా పెంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దానాపూర్‌కు 22 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి 11 రైళ్లు వెళ్తున్నాయి. ఇవన్నీ ప్రతి గురువారం నగరం నుంచి బయలుదేరుతున్నాయి. అలాగే అటునుంచి ఇంతే సంఖ్యలో ప్రతి శనివారం తిరుగు ప్రయాణమవుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లన్నీ అన్‌రిజర్వ్‌డ్‌.  ప్రతి రోజూ నడిచే సికింద్రాబాద్‌ - దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితా ఉన్నందున క్లోనింగ్‌ రైళ్లు మాదిరి వీటిని నడుపుతున్నారు. ఇదే రైలులో అయోధ్యకు వెళ్లే భక్తులు కూడా తోడయ్యారు.

అన్ని ప్రాంతాలకు  ఇలా..

సికింద్రాబాద్‌ - సంత్రగాచి - సికింద్రాబాద్‌ మధ్య 42 రైళ్లు, కాచిగూడ - కోచువెలి - కాచిగూడ మధ్య 4 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌ - ఆరిస్కరా మధ్య 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్‌, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్‌ మీదుగా కర్ణాటకకు ఈ రైళ్లున్నాయి. ఇలా సికింద్రాబాద్‌ - దానాపూర్‌, హైదరాబాద్‌ - గోరఖ్‌పూర్‌, కాచిగూడ - కోచువెలి, సికింద్రాదాద్‌ - అగర్తల, సికింద్రాబాద్‌ - సంత్రగాచి, సికింద్రాబాద్‌ - షాలీమర్‌, సికింద్రాబాద్‌ - పాట్నా, తిరుపతి - షిర్డీ, కాచిగూడ - మధురై, సికింద్రాబాద్‌ - కొళ్లం, హైదరాబాద్‌ - కటక్‌, హైదరాబాద్‌ - రాక్సౌల్‌.. ఇలా ఇతర రాష్ట్రాలను కలుపుతూ నడిచే రైళ్లకు తోడు.. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కూడా ప్రత్యేక రైళ్లున్నాయి. సికింద్రాబాద్‌ - తిరుపతి, లింగంపల్లి - కాకినాడ, హైదరాబాద్‌ - నర్సాపూర్‌, సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం 1079 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఎన్నికల రద్దీతో  అదనంగా..

మహారాష్ట్రలో ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు ముగియగా.. మధ్యప్రదేశ్‌లో  రెండు దశలు పూర్తయ్యాయి. మే నెలలో 7, 13 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 7 దశలకుగాను... ఇప్పటివరకు రెండు దశలే అయ్యాయి. మే 7, 13, 20, 25, జూన్‌ 1 వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. బిహార్‌లో కూడా ఇప్పటికే రెండు దశల ఎన్నికలు జరగ్గా..  మే నెల 7, 13, 20, 25, జూన్‌ నెల 1వ తేదీన ఇంకా 5 దశలు మిగిలి ఉన్నాయి. తెలంగాణలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందినవారుండడంతో ఈ నాలుగు రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే దానాపూర్‌, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఎక్కువ సంఖ్యలో వేశారు. ఇక ఉత్తరాంధ్ర మీదుగా వెళ్లే విశాఖ, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు తోడు అదే మార్గంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని