logo

కాసులు కురిపిస్తున్న కల్తీ

 రాజధానిలో కల్తీ ఆహార ఉత్పత్తుల తయారీ మాఫియా రంకెలేస్తోంది. నూనె, కారం పొడి, అల్లంపేస్టు, టమాటా సాస్‌, సుగంధ ద్రవ్యాల నుంచి.. పిల్లాడికి పట్టించే పాల వరకూ దర్జాగా కల్తీ చేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరిట మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు చలామణీ చేస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు.

Published : 05 Oct 2022 03:10 IST

ఈనాడు- హైదరాబాద్‌:  రాజధానిలో కల్తీ ఆహార ఉత్పత్తుల తయారీ మాఫియా రంకెలేస్తోంది. నూనె, కారం పొడి, అల్లంపేస్టు, టమాటా సాస్‌, సుగంధ ద్రవ్యాల నుంచి.. పిల్లాడికి పట్టించే పాల వరకూ దర్జాగా కల్తీ చేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరిట మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు చలామణీ చేస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఆహార ఉత్పత్తులు, ఔషధాల కల్తీలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2021 సంవత్సరంలో 6,575 కేసులతో ఏపీ దేశంలో ప్రథమస్థానంలో ఉండగా.. 1,326 కేసులతో తెలంగాణ ద్వితీయస్థానంలో నిలిచింది. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 212 కేసులు నమోదయ్యాయి. సరైనా నిఘా, నియంత్రణ లేకపోవడమే కల్తీకి కారణమని ఆహార రంగ నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువగా నూనెలే కల్తీ.. గతేడాది జూన్‌ నుంచి డిసెంబరు వరకూ జీహెచ్‌ఎంసీ 926 ఆహార నమూనాలను సేకరించి పరీక్షించగా.. 98 కల్తీవని తేలింది. అందులోనూ నూనెలే ఎక్కువ కల్తీ ఉన్నాయి. ముఖ్యంగా జంతువుల కొవ్వుతో తయారుచేసిన నూనె కలిపి ప్రముఖ బ్రాండ్ల నూనె డబ్బాల్లో విక్రయించడం, పత్తి గింజలతో చేసిన నూనె, రెండు, మూడుసార్లు వినియోగించిన వాటిని విక్రయించడం వంటి అనేక లోపాలను గుర్తించారు. శివార్లలో ఎక్కువగా కల్తీనూనె తయారు చేస్తున్నారు. వీటి వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది.


ఈ ప్రాంతాలు నకిలీకి కేరాఫ్‌..

బేగంబజార్‌, కాటేదాన్‌ సహా కొన్ని ప్రాంతాలు నకిలీ ఉత్పత్తుల తయారీకి కేంద్రాలుగా మారాయి.  ముఖ్యంగా బేగంబజార్‌లో ప్రముఖ బ్రాండ్లను పోలిన ఉత్పత్తుల్ని తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఉదాహరణకు బ్రాండెడ్‌ సంస్థలు విక్రయించే నెయ్యి కిలో రూ.600 వరకూ ఉంటుంది. బేగంబజార్‌లో కొన్ని దుకాణాల్లో కొవ్వుపదార్థాలతో  చేసిన నెయ్యిని రూ.200కు అమ్మేస్తున్నారు. వీటిని కొందరు వ్యాపారులు  హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. రంపం పొడి మిశ్రమంతో కారం, అల్లంపేస్టు,  మసాలా దినుసులు.. ఇలా అన్నింటిని కల్తీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని