logo

బొట్టుబిళ్లలు, వత్తులంటూ కుచ్చుటోపీ

‘‘బొట్టుబిళ్లలు, దీపం వత్తుల తయారీతో ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ.30 వేల సంపాదన’’ అంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు. ఏకంగా 1,400 మందితో వాటి తయారీ యంత్రాలు కొనుగోలు చేయించాడు.

Published : 29 Nov 2022 04:57 IST

యంత్రాలు విక్రయించి రూ.కోట్లలో వసూలు

రమేశ్‌

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కాప్రా: ‘‘బొట్టుబిళ్లలు, దీపం వత్తుల తయారీతో ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ.30 వేల సంపాదన’’ అంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు. ఏకంగా 1,400 మందితో వాటి తయారీ యంత్రాలు కొనుగోలు చేయించాడు. సరకు కిలోల లెక్కన తనకు విక్రయిస్తే లాభాలు ఇస్తానంటూ నమ్మించి నిండా ముంచాడు. రూ.కోట్లలో మోసానికి పాల్పడి బోర్డు తిప్పేసిన ఆ ఘరానా మోసం ఏఎస్‌రావు నగర్‌లో వెలుగులోకి వచ్చింది. సోమవారం బాధితులు కుషాయిగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆర్మీలో పనిచేసినట్లు చెప్పి..  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన రావులకొల్లు రమేశ్‌ ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌(గోయింగ్‌ టుగెదర్‌) పేరుతో ఏఎస్‌రావునగర్‌లో గతేడాది కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించే ఇతడు ఇంటి దగ్గరే ఉంటూ బొట్టు బిళ్లలు, వత్తుల తయారీ ద్వారా రూ.వేలల్లో సంపాదించవచ్చంటూ వీడియోలు పోస్టు చేసేవాడు. ముడి సరకు ఇస్తామని తయారు చేసిన ఉత్పత్తిని తానే కొంటామని నమ్మించాడు. రూ.30 వేల లోపు ఉండే వత్తుల తయారీ యంత్రాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షలకు, బొట్టు బిళ్లల యంత్రాన్ని రూ.2.80 లక్షలకు విక్రయించి.. మూడు సంవత్సరాలకు ఒప్పందం చేసుకునే వాడు. దూది కిలో రూ.250 చొప్పున అమ్మి.. వత్తుల్ని రూ.550కి కొనేవాడు, బొట్టుబిళ్లల సరకును రూ.2 వేలకు ఇచ్చి.. రూ.2,600 కొంటానని ఒప్పందంలో పేర్కొనేవాడు.

మొత్తం 1400 మంది

ఏడాది కాలంలో రమేశ్‌ 842 మందికి వత్తుల తయారీ, 600 మందికి బొట్టు బిళ్లల యంత్రాలు అమ్మాడు. కొన్నవారిలో నాలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. కొత్తవారిని చేరిస్తే కమీషన్లు ఇచ్చాడు. తొలి రెండు నెలలు ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించిన రమేశ్‌.. ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చాడు. కొన్ని రోజులుగా ఉత్పత్తులను తీసుకోవడం నిలిపేయడం, చెల్లింపులు ఆపడంతో కొందరు నిలదీశారు. డబ్బు తర్వాత ఇస్తామంటూ కార్యాలయంలో పనిచేసే సుధాకర్‌, రామారావు సర్దిచెప్పేవారు. అనుమానం వచ్చిన బాధితులు ఆదివారం కార్యాలయానికి వెళ్లగా రమేశ్‌ కనిపించలేదు. దీంతో  ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్‌ ఒకరు తన ఆటోపై లోన్‌ తీసుకుని డబ్బు కట్టారు. కొందరు మహిళలు డ్వాక్రా రుణాలను ఇందుకు ఖర్చు చేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని