logo

Drugs: బెంగళూరులో పీల్చడం.. భాగ్యనగరంలో అమ్మడం

సరదాగా డ్రగ్స్‌కు అలవాటుపడి.. బానిసలుగా మారి.. ఆపై సరఫరాదారుల అవతారమెత్తిన ఇద్దరు యువకుల గాథ ఇది.

Published : 01 Dec 2022 08:28 IST

డ్రగ్స్‌కు బానిసలై సరఫరాదారులుగా మారిన యువకులు

మొత్తం నలుగురి అరెస్టు.. పరారీలో కింగ్‌పిన్‌

ఈనాడు, హైదరాబాద్‌: సరదాగా డ్రగ్స్‌కు అలవాటుపడి.. బానిసలుగా మారి.. ఆపై సరఫరాదారుల అవతారమెత్తిన ఇద్దరు యువకుల గాథ ఇది. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు రవాణా చేసే బెంగళూరుకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాతో వీరు సంబంధాలు పెట్టుకుని హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. నగరానికి సరకు తెప్పించుకునే క్రమంలో పోలీసులకు దొరికిపోయారు. మొత్తం నలుగురు అరెస్టయ్యారు.  రూ.4 లక్షల విలువైన 12 గ్రాముల హెరాయిన్‌, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం విలేకర్లకు వెల్లడించారు.

తనతో పాటు బావమరిదిని లాగి: నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పాలెం నివాస్‌(24) బెంగళూరులో (2015- 17) అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివాడు. హైదరాబాద్‌కు వచ్చి పుప్పాలగూడలో ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. నివాస్‌ బావమరిది కర్మన్‌ఘాట్‌లో ఉండే మైలపల్లి వెంకట రంగనాథాచారి(20) ప్రైవేటు ఉద్యోగి. నివాస్‌ బెంగళూరులో ఉన్న సమయంలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఇక్కడికి వచ్చాక రంగనాథాచారికి అలవాటు చేశాడు. తరచూ బెంగళూరు వెళ్లి కొనుగోలు చేసేవాడు. అక్కడి తుక్కు వ్యాపారి, డ్రగ్స్‌ విక్రేత మహ్మద్‌ సాద్‌(26)తో పరిచయం పెంచుకున్నాడు. సాద్‌.. స్థానికంగా ఉండే కారు డీలర్‌, డ్రగ్స్‌ సరఫరాదారు సయ్యద్‌ అమీర్‌(26) నుంచి  కొని నివాస్‌కు ఇచ్చేవాడు. నివాస్‌ డబ్బు సంపాదన కోసం సరఫరాదారు అవతారం ఎత్తాడు.  బావమరిదితో కలిసి విక్రయాలు ప్రారంభించాడు. వచ్చే నెలలో నూతన సంవత్సర వేడుకల కోసం నగరానికి డ్రగ్స్‌ చేరకుండా పోలీసులు అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. బెంగళూరు నుంచి కొందరు హైదరాబాద్‌కు చేరవేస్తున్నారని ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం బుధవారం తెల్లవారుజామున సరూర్‌నగర్‌లోని రంగనాథాచారి నివాసానికి వెళ్లగా.. సయ్యద్‌ అమీర్‌, మహ్మద్‌ సాద్‌లు 12 గ్రాముల హెరాయిన్‌ను నివాస్‌, రంగనాథ్‌కు విక్రయిస్తూ చిక్కారు. నిందితుల్ని సరూర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

ప్రతాప్‌ కీలకం: అరెస్టయిన నలుగురికి మాదకద్రవ్యాలు చేరవేస్తున్న ప్రధాన సూత్రధారి ప్రతాప్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బెంగళూరుకు చెందిన అతను డ్రగ్స్‌ నెట్‌వర్క్‌కు కింగ్‌పిన్‌ అని, దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల సమయంలో కేవలం 12 గ్రాములు లభ్యమైంది. ఇంత తక్కువ మొత్తం విక్రయించేందుకే హైదరాబాద్‌ వచ్చారా..? అప్పటికే కొంత ఇతరులకు విక్రయించి ఉంటారా..? ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలు చేస్తున్న వారి కూపీ లాగుతున్నారు. నిందితుల అరెస్టులో కీలకంగా వ్యవహరించిన ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌, ఏసీపీలు శ్రీధర్‌రెడ్డి, వెంకన్న నాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సీతారాం తదితరుల్ని కమిషనర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు