logo

బాలికలకు భరోసా..

ప్రస్తుత సమాజంలో బాలికలపై, అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.

Published : 26 Jan 2023 00:49 IST

వేధింపుల ఫిర్యాదుకు కేంద్రం ప్రత్యేక యాప్‌

జాతీయ బాలల సంరక్షణ యాప్‌

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు: ప్రస్తుత సమాజంలో బాలికలపై, అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా.. ఆశించిన మార్పు రావడం లేదు. చాలా మంది నేరం చేసిన వారికి భయపడి ఫిర్యాదులు చేయడం లేదు. మరి కొందరు పరువు పోతుందని మిన్నకుంటున్నారు. దీంతో చాలా మంది బాధితులకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో నేరగాళ్లను శిక్షించడంతో పాటు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచేందుకు కేంద్రం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీన్లో ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు.


ఎలా చేయాలి...

గూగుల్‌ ప్లేస్టోర్‌లో పీఓసీఎస్‌ఓ ఈబీఓఎక్స్‌ (పోక్సో ఈబాక్స్‌) అని టైప్‌ చేస్తే యాప్‌ కనిపిస్తుంది. దీన్ని ఇన్‌స్టల్‌ చేసుకొని తెరవాలి. లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీపీసీఆర్‌.జీవీఓ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. యాప్‌ తెరవగానే వృత్తంలో పోక్సో ఈబాక్స్‌ అని వృత్తాకారంలో కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. సాధారణంగా చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు కనిపిస్తాయి. చిన్నారులపై జరిగిన అఘాయిత్యం, జరిగేందుకు ఆస్కారమున్న ఆరు ప్రాంతాలు ఆట స్థలం, దుకాణం, రహదారి మీద, పాఠశాల లేదా పాఠశాలకు వాహనాల్లో వెళ్లేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో బాలికలతో అనుచిత ప్రవర్తన, శరీర భాగాలను చిత్రీకరించడం వంటి వాటిని చిత్రాల రూపంలో పెట్టారు. హింస స్వభావాన్ని గమనించి ఆ చిత్రంపై క్లిక్‌ చేయాలి. 


దిల్లీ కేంద్రంగా చర్యలు..

కేంద్ర ప్రభుత్వం బాలికలకు భరోసాను కల్పించేందుకు దేశ రాజధాని కేంద్రంగా చర్యలు ప్రారంభించింది. ఫిర్యాదులను దిల్లీలో కేంద్ర ప్రత్యేక బృందం పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఫిర్యాదు ఎవరు చేశారన్న సమాచారం కూడా తెలియదు.  


నేరాలకు అడ్డుకట్ట..

ప్రమీల, సీఐ, మహిళా పోలీస్‌ఠాణా, వికారాబాద్‌

ఈ యాప్‌తో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. దీనిపై అవగాహన కలిగించడానికి విద్యాసంస్థలు, గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం. బాధ్యత కలిగిన పౌరులుగా జరుగుతున్న అన్యాయాలను వెంటనే చిత్రీకరించి యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి బాధితులకు న్యాయం చేసేలా చొరవ తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని