logo

ఖాళీ ఉంది.. కొలువు మీదే

బ్యాంకు ప్రతినిధులుగా చెలామణి అవుతూ.. ఉద్యోగాల పేరుతో వందలాది మందిని మోసం చేస్తున్న సైబర్‌ ముఠా సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు చిక్కింది.

Published : 31 Jan 2023 04:10 IST

ఉద్యోగాల ముసుగులో వసూళ్లు
దిల్లీలో ఆరుగురి అరెస్టు

స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ప్రింటరు

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకు ప్రతినిధులుగా చెలామణి అవుతూ.. ఉద్యోగాల పేరుతో వందలాది మందిని మోసం చేస్తున్న సైబర్‌ ముఠా సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు చిక్కింది.  గూగుల్‌ మీట్‌ ద్వారా అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేసి మరీ డబ్బు కాజేస్తున్న హైటెక్‌ ముఠాలోని ఆరుగుర్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, ఉద్యోగుల రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఈ తరహా మోసం కేసులో దిల్లీ పోలీసులకు పట్టుబడ్డారు. సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌ శింగెనవార్‌, సైబర్‌క్రైమ్స్‌ డీసీపీ రితిరాజ్‌, సైబర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ శ్యామ్‌బాబు సోమవారం వివరాలు వెల్లడించారు.


అమ్మాయిలతో ఇంటర్వ్యూలు

బిహార్‌లోని నలందా జిల్లా బిఘా గ్రామానికి చెందిన సన్నీకుమార్‌ (22), ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా సింగ్‌ (27), రుచి భారతి (25), శావి పాల్‌ (27), శాంతి (22), మీనా రాజ్‌పుత్‌ (24) ఒక ముఠాగా ఏర్పడ్డారు. బ్యాంకు రికవరీ ఏజెంట్లమంటూ నమ్మించి దిల్లీలోని నొయిడాలో ఒక అపార్టుమెంటులో ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. జాబ్‌ పోర్టళ్ల నుంచి దేశవ్యాప్తంగా నిరుద్యోగుల వివరాలు సేకరించి నేరుగా వాళ్లకే ఫోన్లు చేస్తున్నారు. బహుళజాతి సంస్థల్లో మంచి వేతనాలకు ఉద్యోగాలిప్పిస్తామని నమ్మిస్తారు. ఎవరైనా కొంచెం వివరాలు ఆరా తీయగానే మోసం మొదలుపెడతారు. రిజిస్ట్రేషన్‌, రెజ్యూమె అప్‌డేట్‌, ముఖాముఖి పేరుతో రూ.లక్షల్లో డబ్బు కాజేస్తున్నారు. గూగుల్‌ మీట్‌, ఫోన్‌ ద్వారా అమ్మాయిలతో ముఖాముఖి నిర్వహిస్తూ మోసం చేస్తున్నారు. కొందరికి ఉద్యోగాలిచ్చినట్లు నియామక పత్రాలు ఇచ్చారు. పేదల బ్యాంకు ఖాతాలు సేకరించి వాటిలో బాధితులు పంపే డబ్బును జమ చేయిస్తున్నారు. గతేడాది అక్టోబరులో సైబరాబాద్‌ పరిధిలోని ఇలాంటి కేసులు 25 నమోదయ్యాయి.  టీఎస్‌పీసీసీ సాయంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ గుర్తించారు. నొయిడాలో ఆరుగురిని అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు