logo

జల వనరుల సంరక్షణ అందరి బాధ్యత

జిల్లాలో జల వనరులను సంరక్షించుకుంటేనే ముందు తరాల వారి మనుగడకు సహకారాన్ని అందించిన వారమవుతాం. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించాలి.

Published : 09 Feb 2023 01:57 IST

జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారిణి

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లాలో జల వనరులను సంరక్షించుకుంటేనే ముందు తరాల వారి మనుగడకు సహకారాన్ని అందించిన వారమవుతాం. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించాలి. పొలం వద్ద నిల్వ ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భూగర్భ జల వనరుల శాకాధికారిణి డాక్టర్‌ దీపారెడ్డి అన్నారు. వచ్చేది ఎండా కాలం. ఈ సమయంలో సాగుకు, తాగుకు నీటి వాడకం ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడే ప్రతి నీటిబొట్టు సద్వినియోగం అయ్యే విధంగా ఏంచేయాలి.. వంటి అంశాలపై ఆమెతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను తెలిపారు.. వివరాలు..

ప్ర: భూగర్భ జలాల తీరు ఎలా ఉంది.

జ: రైతులు, ఇతరులు ఇష్టమున్న విధంగా బోర్లు వేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే ముందు తరాల వారు నీటి కరవు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జిల్లాలో రెండు నెలల క్రితం నాటికీ, నేటికీ పరిస్థితిని చూస్తే అర మీటర్‌ వరకు నీటి మట్టాలు పడిపోయాయి. మరో రెండు నెలల్లో మరింత కిందకు పడిపోతాయి. నీటిని సంరక్షించుకునేందుకు చెక్‌ డ్యాంలు, పర్కులేషన్‌ ట్యాంకులు, నీటి గుంతులు నిర్మించాల్సిన అవసరం ఉంది. మున్సిపల్‌, పట్టణాల్లో వర్షపు నీరు నేలలో ఇంకే విధంగా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలి.  

ప్ర. వాల్టా చట్టం అమలు అవుతుందా..

జ. వ్యవసాయ బోర్లు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా 2003లో వాల్టా చట్టాన్ని తీసుకు వచ్చారు. ఈ చట్టం అంతంతగానే కొనసాగుతోంది. వ్యవసాయ బోర్లు వేసేటప్పుడు తప్పనిసరిగా బోరుకు బోరుకు మధ్యన 300 మీటర్ల దూరం ఉండాలి. నల్ల రేగడి భూముల్లో బోరు వేయటం కంటే బావిని తవ్వుకోవటం మంచిది.

ప్ర. వేసవిలో ఏ విధంగా వ్యవహరించాలి

జ. నెల దాటితే వేసవి వస్తుంది. ఆ సమయంలో బోరు యజమానులు ఫ్లషింగ్‌ చేయించుకోవాలి. బావుల్లో పూడికలు తీయించాలి. గ్రామాల్లో వట్టిపోయిన బావులను చెత్తకుండీలుగా కాకుండా నీటి రీఛార్జ్‌ పిట్‌లుగా మార్చుకోవాలి.

జిల్లాలో బోరు డ్రిల్లింగ్‌ యజమానులు ఇప్పటి వరకు కేవలం ఇద్దరు మాత్రమే నమోదు చేయిచుకున్నారు. వికారాబాద్‌, తాండూర్‌, పరిగిలో బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌ యజమానులు చాలా మంది ఉన్నారు. బోరు వేసే యజమానులు తప్పని సరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని