logo

వారసత్వానికి జవసత్వం

శతాబ్దాల చరిత్ర గల నగరంలో వారసత్వ కట్టడాలకు కొదువ లేదు. వందలాది నిర్మాణాలు ఇప్పటికీ ఆనాటి రాజసాన్ని కళ్లకుకడుతున్నాయి.

Published : 20 Mar 2023 02:28 IST

నగరంలో 142 వారసత్వ కట్టడాలు
పరిరక్షణే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీకి జాబితా
యాజమాన్యం, ఇతర వివరాలపై సర్వేకు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, చార్మినార్‌

రంగులు వేయడంతో మెరిసిపోతున్న కాలికమాన్‌

శతాబ్దాల చరిత్ర గల నగరంలో వారసత్వ కట్టడాలకు కొదువ లేదు. వందలాది నిర్మాణాలు ఇప్పటికీ ఆనాటి రాజసాన్ని కళ్లకుకడుతున్నాయి. ఇందులో కొన్ని శిథిలావస్థకు చేరుకోగా, మరికొన్ని నిరాదరణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. యుద్ధ ప్రాతిపదికన వారసత్వ కట్టడాల యాజమాన్య వివరాలను లెక్క తేల్చాలని జీహెచ్‌ఎంసీని ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు నిర్మాణాల ‘టైటిల్‌’ వివరాలపై నగర ప్రణాళిక విభాగం సర్వేకు సిద్ధమవుతోంది.

యాజమానులు ఎవరు?

నగరవ్యాప్తంగా 20కిపైగా క్లాక్‌ టవర్లు, పదుల కొద్దీ బురుజులు, కమాన్‌లు, ద్వారాలు, మసీదులు, పాతకాలం అతిథి గృహాలు, మెట్ల బావులు, వేర్వేరు సంస్థల భవనాలు, హోటళ్లు, ఇతరత్రా నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశించినట్లు త్వరలోనే టైటిల్‌ సర్వే ప్రారంభిస్తామని ప్రణాళిక విభాగం తెలిపింది. కట్టడాలు, వాటి హక్కు పత్రాలను పరిశీలించి, వివాదాలుంటే వాటి వివరాలు సైతం సర్వేలో భాగంగా రికార్డు చేస్తామని అధికారులు అంటున్నారు. కట్టడాలకు అసలైన యజమానులు ఎవరు, నిర్మాణం ఎప్పటిది, ప్రస్తుతం ఎలా ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది, యాజమాన్యంపై కోర్టు కేసులేమైనా ఉన్నాయా, ఉంటే పరిష్కారం ఎలా తదితర వివరాలు సర్వేలో తెలుసుకుంటారు.  దీంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.

కొనసాగుతున్న సర్దార్‌మహల్‌ పునరుద్ధరణ పనులు

మెజార్టీ మూసీ చుట్టూనే..

నిజాం హయాంలో మూసీ చుట్టూనే నగరం నిర్మాణమైంది. ఆస్పత్రులు, వాణిజ్య భవనాలు, మార్కెట్లు, ఉద్యానవనాలు, పరిపాలన భవనాలు, రాజ మందిరాలు నదికి ఇరువైపులా వెలిశాయి. 142 వారసత్వ కట్టడాల జాబితాలో మూసీకి ఇరువైపులా అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌, ఫలక్‌నుమా, గోషామహల్‌, అబిడ్స్‌, పురాణాపూల్‌ ప్రాంతాల్లోని నిర్మాణాలే అధికంగా ఉన్నాయి. సమాంతరంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే పాతబస్తీ కేంద్రంగా రూ.164.5 కోట్లతో పలు చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.30 కోట్లతో చేపట్టిన సర్దార్‌ మహల్‌ పునరుద్ధరణ పనులు నెల రోజులుగా కొనసాగుతున్నాయి. రూ.45 కోట్లతో లాడ్‌బజార్‌, రూ.36 కోట్లతో ముర్గిచౌక్‌, రూ.10.5 కోట్లతో మీరాలంమండి, రూ.40 కోట్లతో పత్తర్‌గట్టీ, ఇతరత్రా కట్టడాల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి.

సర్కిళ్లుగా విభజించి సర్వే..

గ్రేటర్‌ పరిధిలోని అలిమంజిల్‌, హైకోర్టు, స్టేట్‌ ఆర్కియలాజికల్‌ మ్యూజియం, సిటీకాలేజ్‌, సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌, ఫతేమైదాన్‌ క్లాక్‌ టవర్‌, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, ఆంధ్రపత్రిక భవన్‌, అస్మాన్‌ఘర్‌ ప్యాలెస్‌, అమీన్‌ మంజిల్‌, అలియాబాద్‌ సరాయి, అఫ్జల్‌గంజ్‌ మసీదు తదితర మొత్తం 142 వారసత్వ కట్టడాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు ఇచ్చింది. వీటిని సర్కిళ్ల వారీగా విభజించి, సర్వే చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని