logo

మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో దొంగల వీరంగం

మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దొంగలు విరుచుకుపడ్డారు. నాలుగు బోగీల్లో ప్రయాణికులు నిద్రలో ఉండగా బ్యాగులు ఎత్తుకెళ్లారు.

Published : 26 Mar 2023 02:04 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దొంగలు విరుచుకుపడ్డారు. నాలుగు బోగీల్లో ప్రయాణికులు నిద్రలో ఉండగా బ్యాగులు ఎత్తుకెళ్లారు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును బదిలీ చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన మహాలక్ష్మి ఎస్‌-8లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు వస్తుంది. రైలు మహబూబాబాద్‌కు వచ్చిన సమయంలో నిద్రలేచి చూసుకోగా బ్యాగు కనిపించలేదు. అందులో సెల్‌ఫోన్‌ రూ.వేయి, నగదు, బ్యాంకు కార్డులున్నాయి. మచిలీపట్నం సమీపంలోని నారాయణపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జితిన్‌కుమార్‌ ఎస్‌-5బోగీలో వస్తున్నాడు. అతడి దుస్తులు, రూ.35వేల నగదున్న బ్యాగూ కనిపించలేదు. సికింద్రాబాద్‌లో ఉండే రోచల్‌  ఎస్‌-13బోగీలో సికింద్రాబాద్‌ వస్తున్నారు. ఆమె దుస్తులు, నగదు ఉన్న సూట్‌కేసు చోరీకి గురైంది. ఎస్‌-7బోగీలో మదీనగూడకు చెందిన  దివ్య తన తల్లితో కలిసి వస్తుంది. దుస్తులు, రూ.30వేలు నగదున్న బ్యాగు చోరీకి గురయ్యాయి. బాధితులు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరి బ్యాగులు టాయిలెట్లలో పడవేసి ఉండగా ఆర్పీఎఫ్‌ పోలీసులు వారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని