logo

MMTS: అప్పుడు ఆడ్వాణీ.. ఇప్పుడు మోదీ

ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభించిన అనంతరం.. నగరానికి ఎంతో కీలకంగా భావించే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.700 కోట్ల విలువైన ప్రాజెక్టు ఇది.

Updated : 06 Apr 2023 09:52 IST

ఎంఎంటీఎస్‌ల ప్రస్థానంలో అగ్రనేతలు
ఈనాడు - హైదరాబాద్‌

2003 ఆగస్టు 9వ తేదీన అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఎంఎంటీఎస్‌ మొదటి దశను ప్రారంభించారు. సికింద్రాబాద్‌ - లింగంపల్లి, హైదరాబాద్‌ - లింగంపల్లి మార్గాల్లో 29 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏడాది సికింద్రాబాద్‌ - ఫలక్‌నుమా సెక్షన్‌ 15 కిలోమీటర్ల మేర సర్వీసులు అందుబాటులోకి రావడంతో మొదటి దశ పూర్తయ్యింది.

20 ఏళ్ల అనంతరం 2023 ఏప్రిల్‌ 8న.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌ స్టేషన్లో, అదే ప్లాట్‌ఫామ్‌పై ఎంఎంటీఎస్‌ రెండో దశను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ - బొల్లారం - మేడ్చల్‌ మధ్య 28 కిలోమీటర్ల మేర మొదటి సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా మొత్తం 95 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఎంఎంటీఎస్‌ రెండోదశను ప్రారంభించినట్లవుతుంది.


సికింద్రాబాద్‌ - తిరుపతి వందేభారత్‌ రైలు

ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభించిన అనంతరం.. నగరానికి ఎంతో కీలకంగా భావించే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.700 కోట్ల విలువైన ప్రాజెక్టు ఇది. తర్వాత సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని పదో నంబరు ప్లాట్‌ఫామ్‌ నుంచి సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య వందేభారత్‌ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు.


ఎంతో తేడా..

2000 సంవత్సరంలో రైల్వే అధికారులు ఎంఎంటీఎస్‌ మొదటి దశ పనులు చేపట్టి 2004లో రూ.158.83 కోట్లతో పూర్తి చేశారు. రెండో దశను 2007లోనే ప్రారంభించాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో 2014లో మొదలైంది. 2019 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. 2023 నాటికీ పూర్తి కాలేదు. రూ.816 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ప్రాజెక్టు.. రూ.1100 కోట్లు దాటింది.


రెండో దశ ఇలా..

ఈ ఏడాది బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌ రెండోదశకు రూ.600 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వీటితో సికింద్రాబాద్‌ - బొల్లారం - మేడ్చల్‌ మార్గంలో 14 సర్వీసులు అందుబాటులోకి రానున్నారు.

ఫలక్‌నుమా - ఉందానగర్‌ - శంషాబాద్‌ విమానాశ్రయం 20 కిలోమీటర్ల మార్గం ఉందానగర్‌ వరకు పూర్తయ్యింది. ప్రస్తుతం ఫలక్‌నుమా వరకు నడుస్తున్న ఎంఎంటీఎస్‌లు ఈ నెల 8 నుంచి ఉందానగర్‌ వరకు నడవనున్నాయి.

లింగంపల్లి - తెల్లాపూర్‌ 9 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది. రాత్రిపూట చివరి రైలు అక్కడి వరకూ వెళ్తోంది. వేకువజామున అక్కడి నుంచే బయలుదేరుతోంది. ప్రతి రైలు తెల్లాపూర్‌కు వెళ్తుందా లేదా తెలియాల్సి ఉంది.

సికింద్రాబాద్‌ - మౌలాలి - ఘట్‌కేసర్‌ 19 కిలోమీటర్ల మార్గం, మౌలాలి - సనత్‌నగర్‌ ఖార్డ్‌ లైన్‌ 21 కిలోమీటర్లు, కాచిగూడ - సీతాఫల్‌మండి - మల్కాజిగిరి - మౌలాలి ఖార్డ్‌ లైన్‌ 10 కిలోమీటర్లు ఇంకా పూర్తి కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని