logo

Hyderabad-ORR: ఓఆర్‌ఆర్‌పైకి రాకపోకలు ఇక సులువు

మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న ఓఆర్‌ఆర్‌పైకి రాకపోకలు మరింత సులువుగా మార్చేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. నార్సింగి వద్ద నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ పనులు చివరికి దశకు చేరుకున్నాయి.

Updated : 24 May 2023 09:57 IST

నార్సింగి వద్ద ఇంటర్‌ఛేంజ్‌ ప్రారంభానికి సిద్ధం
త్వరలో మల్లంపేట, నియోపొలిస్‌ వద్ద అందుబాటులోకి
ఈనాడు, హైదరాబాద్‌

మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న ఓఆర్‌ఆర్‌పైకి రాకపోకలు మరింత సులువుగా మార్చేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. నార్సింగి వద్ద నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ పనులు చివరికి దశకు చేరుకున్నాయి. 10 రోజుల్లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ఇంటర్‌ఛేంజ్‌ నుంచి అవుటర్‌పైకి వాహనాలు సులువుగా చేరడానికి, అవుటర్‌ నుంచి కిందికి దిగడానికి ఉపయోపడనుంది. ఇందుకు రూ.30 కోట్లు వెచ్చించారు. మహానగరం చుట్టూ ఓఆర్‌ఆర్‌ 158 కిలోమీటర్ల మేర 8 లైన్లతో నిర్మించారు. రెండు వైపులా 4 లైన్లతో సర్వీసు రోడ్లున్నాయి. ప్రస్తుతం 19 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లున్నాయి. అంటే సరాసరి 8-9 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నిర్మించారు. ఓఆర్‌ఆర్‌పై కొత్తగా ప్రయాణించేవారు కొంత గందరగోళానికి గురవుతుంటారు. సూచికలు ఉన్నప్పటికీ ఒకచోట దిగబోయి మరో ఇంటర్‌ఛేంజ్‌ వరకు వెళ్లి తిరిగి సర్వీసు రోడ్డులో వెనక్కి వస్తుంటారు. అలా 10-15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణిస్తుంటారు. రాత్రివేళల్లో ఈ ఇబ్బందులు ఎక్కువ. దీంతో 5-6 కిలోమీటర్లకు ఒక ఇంటర్‌ఛేంజ్‌ ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది.

ప్రస్తుత ఇంటర్‌ఛేంజ్‌లు

కోకాపేట, ఈదుల నాగులపల్లి, పటాన్‌చెరు, సుల్తాన్‌పూర్‌, సారగూడెం, మేడ్చల్‌, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్‌, తారామతిపేట, పెద్దఅంబర్‌పేట,  బొంగులూర్‌, రావిర్యాల, తుక్కుగూడ, పెద్దగోల్కొండ, రాజేంద్రనగర్‌, టీఎస్‌పీఎస్‌, నానక్‌రాంగూడ, కొల్లూరు.

కొత్తగా ప్రణాళిక

* పెద్దఅంబర్‌పేట-బొంగులూరు మధ్య 2
* కీసర-దుండిగల్‌  మధ్య 2


రద్దీ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని..

నార్సింగి ఇంటర్‌ఛేంజ్‌ను పరిశీలిస్తున్న హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌, సీఈ బీఎల్‌ఎన్‌రెడ్డి తదితరులు

ఓఆర్‌ఆర్‌పైకి వాహనాల రద్దీ పెరుగుతోంది. దీంతో ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మించనున్నారు. వీటికి అనుగుణంగా గ్రిడ్‌రోడ్డు, రేడియల్‌ రోడ్లూ రాబోతున్నాయి. అందుకే ఇంటర్‌ఛేంజ్‌లు అనివార్యం. ప్రస్తుతం గచ్చిబౌలి-శంషాబాద్‌ మధ్య 3 ఉన్నాయి. నార్సింగి చుట్టుపక్కన ప్రాంతాలవారు తెలంగాణ పోలీసు అకాడమీ వరకు వెళ్లి అక్కడ నుంచి అవుటర్‌పైకి చేరుకునేవారు. ఇక నుంచి ఆ ఇబ్బందులుండవు. నార్సింగి వద్ద ప్రవేశ, నిష్క్రమణలతో కూడిన ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మిస్తున్నారు. అవుటర్‌ చుట్టూ ఎన్‌హెచ్‌ 65, 44, 163తోపాటు నర్సాపూర్‌, నాగార్జునసాగర్‌, వికారాబాద్‌ తదితర రాష్ట్ర రహదారులు అనుసంధానమై ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లకు లీజుకు ఇచ్చినా ఇంటర్‌ఛేంజ్‌లు, సర్వీసు రోడ్లు, గ్రిడ్‌రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులు మాత్రం హెచ్‌ఎండీఏనే చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని