logo

కూర్చోబెట్టండి.. రూ.కోట్లు కురిపిస్తాం

కోరుకున్న చోట పోస్టింగ్స్‌ కోసం పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి వరుస కడుతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది.

Published : 28 Jun 2023 01:40 IST

పోస్టింగ్స్‌ కోసం  ప్రజాప్రతినిధుల  చుట్టూ ప్రదక్షిణలు
గ్రేటర్‌లో కీలక ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ స్థానాలకు ఫుల్‌ డిమాండ్‌
ఈనాడు, హైదరాబాద్‌

కోరుకున్న చోట పోస్టింగ్స్‌ కోసం పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి వరుస కడుతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో జనావాస విస్తరణతో భూములకు గిరాకీ పెరిగింది. రూ.కోట్లు పలికే భూ వివాదాలతో లాభపడొచ్చనే ఆలోచన కూడా దీనికి కారణం కావచ్చని ఓ పోలీసు ఉన్నతాధికారి విశ్లేషించడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఇటీవల 141 మంది ఇన్‌స్పెక్టర్లు ఏసీపీ/డీఎస్పీలుగా పదోన్నతి పొందారు. దీంతో ఇప్పటివరకూ వీరు పనిచేసిన ఎస్‌హెచ్‌వో స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. పదోన్నతి సాధించిన వారిలో అధికశాతం గతంలో పనిచేసిన చోటనే ఉన్నతాధికారిగా చక్రం తిప్పాలనే యోచనలో ఉన్నారు.  

ఉత్తర్వులిచ్చినా ఉత్తిదే?

శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఠాణాలో ఎస్‌హెచ్‌వో/ ఏసీపీ పోస్టింగ్స్‌కు సంబంధిత ప్రజాప్రతినిధి ఆమోద ముద్ర ఉండాల్సిందే. నేత మాట కాదని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినా బాధ్యతలు చేపట్టడం కత్తిమీద సాముగా మారింది. నగరంలో కొత్తగా ఏర్పడిన డివిజన్‌కు ఏసీపీ పోస్టు కేటాయించారు. ఓ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. తీరా ఆయన బాధ్యతలు చేపట్టకుండానే తిరిగి హెడ్‌క్వార్టర్స్‌కు చేరారు. ఇద్దరు సీనియర్‌ నాయకుల మధ్య ఆ పోస్టింగ్‌ విషయంలో నెలకొన్న గొడవతో మూడు నెలలుగా ఆ డివిజన్‌ ఏసీపీగా ఎవర్ని నియమించాలనేది ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమమండలంలో ఒక ఇన్‌స్పెక్టర్‌కు పదోన్నతి రావటంతో ఖాళీ ఏర్పడింది. ఖరీదైన ఠాణా కావటంతో ఇప్పటికే సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్లలో పనిచేస్తున్న ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు కొద్దిరోజులుగా ఒక ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు.


పైరవీలదే పైచేయి..

సైబరాబాద్‌ పరిధిలో కీలక డివిజన్‌ ఏసీపీ మూడేళ్ల సమయం పూర్తవడంతో బదిలీ కాబోతున్నారు. అక్కడ తమకు అవకాశం కల్పిస్తే అండగా ఉంటామంటూ ఒకర్నిమించి మరొకరు పోటీపడుతున్నారు. హోటళ్లు, స్పాలు, ఐటీ కంపెనీలున్న మరో డివిజన్‌లో తానే ఏసీపీనంటూ ఒక అధికారి ముందుగానే సిబ్బందికి పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాచకొండ పరిధిలో ముఖ్యమైన డివిజన్‌ పోస్టింగ్‌ తనకే ఇప్పించాలంటూ కొందరు మంత్రుల వద్ద పైరవీలు చేస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లలో 10 ఏసీపీ, 40కు పైగా ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు ప్రస్తుతం గిరాకీ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని