logo

మల్కాజిబరిలో ఎవరో!

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి శాసనసభా స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు భారాస అధిష్ఠానం మళ్లీ టికెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated : 29 Aug 2023 06:38 IST

మైనంపల్లిపై వారంలో భారాస తుది నిర్ణయం
టికెట్‌ కోసం  రాజశేఖర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు పోటీ
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి శాసనసభా స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు భారాస అధిష్ఠానం మళ్లీ టికెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మైనంపల్లి.. మంత్రి హరీశ్‌రావుపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఆ పార్టీ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మైనంపల్లి స్థానంలో మరొకరిని ఈ స్థానం నుంచి బరిలో నిలపాలని పార్టీ యోచిస్తోందని చెబుతున్నారు. ఇదే జరిగితే టికెట్‌ ఎవరికి దక్కుతుందన్న దానిపై పలు ఊహాగానాలు నెలకొన్నాయి.

త శానసభ ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు ఇక్కడ విజయం సాధించినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తదితరులతో సన్నిహితంగానే ఉంటున్నారు. రెండు మూడేళ్లగా ఆయన కుమారుడు రోహిత్‌ మెదక్‌ నియోజకవర్గంపై దృష్టిసారించారు. అక్కడ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తనకు మల్కాజిగిరి నుంచి, తన కుమారుడికి మెదక్‌ టికెట్‌ కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. మైనంపల్లికి మల్కాజిగిరి స్థానం నుంచి బరిలో దిగడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రోహిత్‌కు టికెట్‌ ఇవ్వలేదు. మెదక్‌ స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికే మళ్లీ కేటాయించారు. ఈ నేపథ్యంలో టికెట్ల ప్రకటన సమయానికి కొద్ది గంటల ముందు మైనంపల్లి తిరుపతిలో మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత హన్మంతరావు వ్యాఖ్యలను ఖండించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మైనంపల్లి కూడా తాను, తన కుమారుడు రెండు చోట్ల పోటీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్‌ నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. రెండుచోట్లా ఇస్తే ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లడం ఖాయమంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారం రోజుల్లో భారాస తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ స్థానాన్ని తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి కేటాయించాలని మంత్రి మల్లారెడ్డి పార్టీని కోరుతున్నారని సమాచారం. రాజశేఖర్‌రెడ్డి గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ బరిలో నిలిచి పరాజయం పాలయ్యారు. ఎన్నికల వ్యయమంతా తానే భరిస్తానని.. తన అల్లుడిని గెలిపించుకుంటానని మల్లారెడ్డి పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు కూడా తనకు ఆ టికెట్‌ తనకివ్వాలని కోరుతున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర నేతలతో కూడా రాజు సన్నిహితంగా ఉంటారు. మల్లారెడ్డికి మేడ్చల్‌ టికెట్‌ ఇచ్చిన నేపథ్యంలో అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి మరో టికెట్‌ ఇస్తారా అన్న దానిపై చర్చ సాగుతోంది. భాజపా తరఫున మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్‌ నేత రామచంద్రరావు ఈసారి కూడా మల్కాజిగిరి నుంచి బరిలో దిగే అవకాశం ఉందని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని