logo

Hyderabad: ఎల్‌ఆర్‌ఎస్‌లో కదలిక!

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిశీలనలో కదలిక ప్రారంభమైంది.

Updated : 15 Jan 2024 08:23 IST

 నాలుగు జోన్ల పరిధిలో 3 లక్షల దరఖాస్తులు
ఒకే లాగిన్‌తో పరిష్కారంలో కొంత జాప్యం 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిశీలనలో కదలిక ప్రారంభమైంది. ఎన్నికలు.. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కొంత ఆలస్యమైనప్పటికీ, తాజాగా ఊపందుకుంది. ప్రత్యేకంగా 30 మంది సిబ్బందికి ఇటీవల శిక్షణ ఇచ్చారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నన్స్‌ (సీజీజీ) సాఫ్ట్‌వేర్‌ సహకారం అందిస్తోంది. నాలుగు జోన్ల పరిధిలో దాదాపు 3 లక్షల దరఖాస్తులు.. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం పెండింగ్‌లో ఉన్నవి. వ్యక్తిగత ప్లాట్లతో పాటు లేఅవుట్లలో ఇప్పటికే 10 శాతం విక్రయించిన ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఆదాయంపై హెచ్‌ఎండీఏ కన్నేసింది.

ఇదీ పరిస్థితి.. హెచ్‌ఎండీఏ ఏడాదిన్నర క్రితం ఎల్‌ఆర్‌ఎస్‌ కింద మున్సిపాలిటీలు, పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లు క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. దీంతో శంషాబాద్‌, శంకర్‌పల్లి, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ పరిధిలో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఉండాలని అధికారులు తెలిపారు. 2020 ఆగస్టు నాటికి కొనుగోలు చేసిన వాటికి అనుమతులు లేకపోతే అలాంటి ప్లాట్లకు కూడా అవకాశం కల్పించారు. నిబంధనల ప్రకారం బల్డియా, హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌, ప్రభుత్వ స్థలాలు, పట్టణ భూగరిష్ఠ చట్టం మిగులు భూములు, దేవాదాయ భూముల్లో లేఅవుట్లు ఉంటే అనుమతించరు. పూర్తిస్థాయిలో స్క్రూట్నీ ద్వారానే ఇలాంటి దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఉన్న వాటికే.. ప్రొసిడింగ్స్‌ జారీ చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన, లోపాల గుర్తింపు తదితరాలకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ వాడుతున్నారు. ఒక మండలంలో ఒక ఏపీవోకు ఒకే లాగిన్‌ ఇవ్వడం వల్ల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. గతంలో ఒకేసారి వేర్వేరు వ్యక్తులు లాగిన్‌ అయి దరఖాస్తులను చూసే వారు.అక్రమాలు జరిగే అవకాశం ఉండటంతో ఒకే సమయంలో ఒకరికే లాగిన్‌ పరిమితం చేశారు.

అంచనా రూ.వేయి కోట్లు

గతంలో పోల్చితే హెచ్‌ఎండీఏ పరిధిలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఓఆర్‌ఆర్‌ చుట్టూ భారీ ఎత్తు వెంచర్లు, లేఅవుట్లు వెలిశాయి. ప్రాంతీయ రింగ్‌ రోడ్డుకు శరవేగంగా ప్రణాళిక సిద్ధం కావడంతో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకొని అనుమతులు, ఇతర ఫీజులు కింద భారీ ఎత్తున ఆదాయం సమకూర్చునేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా అనధికారిక లేఅవుట్లను సక్రమం చేయడం ద్వారా ఏడు జిల్లాల పరిధిలో రూ.వేయి కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని