logo

ఉగాది నాటికి చర్లపల్లి రైల్వే టర్మినల్‌

దశాబ్దాలపాటు సరిపడా రైల్వే స్టేషన్లు లేక.. నగరంలో తిరిగేందుకు సబర్బన్‌ రైళ్లు లేక అవస్థలు పడిన రైల్వే ప్రయాణికులకు త్వరలోనే ఊరట లభించనుంది.

Published : 18 Jan 2024 02:39 IST

జనవరిలోనే ఎంఎంటీఎస్‌ల పూర్తి స్థాయి పరుగులు

దశాబ్దాలపాటు సరిపడా రైల్వే స్టేషన్లు లేక.. నగరంలో తిరిగేందుకు సబర్బన్‌ రైళ్లు లేక అవస్థలు పడిన రైల్వే ప్రయాణికులకు త్వరలోనే ఊరట లభించనుంది. నగర ప్రయాణికుల భారాన్ని మొత్తం మోసిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా చర్లపల్లిలో నిర్మిస్తున్న శాటిలైట్‌ టర్మినల్‌ ఈ ఏడాది ఉగాది నాటికి అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నారు. మార్చినాటికి పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని ఇటీవల కిషన్‌రెడ్డి స్టేషన్‌ నిర్మాణ పనుల వీడియోను సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు.  ఇదే సమయంలో చర్లపల్లి మీదుగా ఘట్‌కేసర్‌ వరకూ నిర్మించతలపెట్టిన ఎంఎంటీఎస్‌ రెండోదశ కూడా ఈ లోపే పూర్తి కానుంది.

ప్రయోజనాలు: వందేళ్లుగా నగర ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చుతున్న సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ స్టేషన్లు రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. తాజా అభివృద్ధి పనులతో చర్లపల్లి నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలకు వెసులుబాటు కలుగుతుంది. ఎంఎంటీఎస్‌ రైళ్ల కోసం కొత్త లైన్లు, ప్లాట్‌ఫామ్స్‌  అందుబాటులోకి వస్తాయి. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్‌ భవనం అందుబాటులోకి వస్తుంది. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఐదేసి చొప్పున నిర్మిస్తున్నారు.  ఇక్కడ రూ. 350 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. అదనంగా మరో నాలుగు ప్లాట్‌ఫామ్స్‌ సిద్ధమౌతున్నాయి. పాదచారుల వంతెనలు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు, కొత్త స్టేషన్‌ భవనం సమకూరుతాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు నడిపితే.. లోకల్‌గా తిరిగే ఎంఎంటీఎస్‌ రైళ్ల కు ఆటంకాల సమస్య కూడా తొలగిపోనుంది.

అక్కడ దిగి.. ఎంఎంటీఎస్‌లో నగరానికి

దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల నుంచి చర్లపల్లిలో దిగి ఔటర్‌ రింగురోడ్డు మీదుగా ఇళ్లకు రావొచ్చు. లేదా రెండో దశలో అందుబాటులోకి వస్తున్న ఎంఎంటీఎస్‌ రైళ్ల ద్వారా నగరంలోకి చేరుకోవచ్చు. ఎంఎంటీఎస్‌ల కోసం ప్రత్యేకంగా ప్లాట్‌ఫామ్‌లు నిర్మించడంతో పాటు.. రెండు లైన్లు అందుబాటులోకి వచ్చాయి.  మౌలాలి నుంచి చర్లపల్లికి నాలుగు లైన్లు అందుబాటులో ఉన్నాయి. మౌలాలి నుంచి సికింద్రాబాద్‌కు కేవలం రెండు లైన్లే ఉన్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను బైపాస్‌ చేస్తూ మౌలాలి - సనత్‌నగర్‌ మధ్య రెండో లైను సిద్ధమవ్వడంతో నగరంలోకి ఎక్కడా ఆలస్యం కాకుండా రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని