logo

కొత్తగా 20 ఎఫ్‌వోసీలు

కొత్తగా ఏర్పాటైన విద్యుత్తు సెక్షన్లలో ప్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్ల(ఎఫ్‌వోసీ)ను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ మంజూరు చేసింది. విద్యుత్తు అంతరాయాలపై స్థానికంగా వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎఫ్‌వోసీ పనిచేస్తుంది.

Published : 27 Mar 2024 01:12 IST

నూతనంగా ఏర్పాటైన సెక్షన్లకు మంజూరు
విద్యుత్తు అంతరాయాలపై స్థానికంగా ఫిర్యాదుకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పాటైన విద్యుత్తు సెక్షన్లలో ప్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్ల(ఎఫ్‌వోసీ)ను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ మంజూరు చేసింది. విద్యుత్తు అంతరాయాలపై స్థానికంగా వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎఫ్‌వోసీ పనిచేస్తుంది. వీటిని బలోపేతం చేసే దిశగా ఇటీవల 20 కొత్త ఎఫ్‌వోసీల ఏర్పాటుకు సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య భారీగా పెరిగిన చోట గత ఏడాది విడదీసి కొత్త ఆపరేషన్‌ సెక్షన్లను 17 ఏర్పాటు చేశారు. వీటికి ఈ నెల 7న 17 ఎఫ్‌వోసీలను మంజూరు చేశారు. సరూర్‌నగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ అభ్యర్థన మేరకు మార్చి 21న మరో 3 కేంద్రాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో కేంద్రంలో ఆరేడు మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. విడతలవారీగా పనిచేస్తారు. ఒక ఆపరేటర్‌తోపాటు ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ సిబ్బంది ఇద్దరు విధుల్లో ఉంటారు. ఆపరేషన్‌ ఏఈ నేతృత్వంలో సెంట్రల్‌ బ్రేక్‌ డౌన్‌ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాల్సి ఉంటుంది. అల్వాల్‌, కిషన్‌బాగ్‌, మలక్‌పేట, సూర్యనగర్‌, హఫీజ్‌పేట్‌, నల్లగండ్ల, మోకిలా, వైట్‌ఫీల్డ్‌, కిస్మత్‌పూర్‌, శాస్త్రీపురం, బాలాపూర్‌, ఉప్పల్‌ భగాయత్‌, మేడిపల్లి, బౌరంపేట్‌, వేమన కాలనీ, గుండ్లపోచంపల్లి, పేట్‌ బషీరాబాద్‌, ఇంజాపూర్‌, బడంగ్‌పేట్‌, ఆదిభట్లలో కొత్త ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో సిటీలో ఎఫ్‌వోసీల సంఖ్య 212కి చేరిందని ఒక అధికారి తెలిపారు.

ఆటోలకు జీపీఎస్‌

ఒక్కో ఎఫ్‌వోసీ కేంద్రానికి ఒక అద్దె ఆటోను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతరాయాల సమయంలో ఆర్టిజన్‌, జూనియర్‌ లైన్‌మెన్లు, లైన్‌మెన్లు ఫిర్యాదులపై తక్షణం సామగ్రితో వెళ్లేందుకు ఆటో సదుపాయం కల్పించారు. వీటిలో తిరగకుండానే తిరిగినట్లు తప్పుడు బిల్లులు పెడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అక్రమాలకు ఆస్కారం లేకుండా ఆటోలకు జీపీఎస్‌ అమర్చబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని