logo

పచ్చ బంగారం.. రైతన్నకు వరం

ఏళ్ల తరబడి పసుపు పంటను నమ్ముకుని సాగు చేసి బతుకుతున్న రైతన్నల ఈసారి మంచి శుభ వార్త వినిపిస్తోంది. పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా క్వింటాల్‌ పసుపు ధర రూ.20,000 పలుకుతోంది.

Published : 27 Mar 2024 01:14 IST

రూ.15,000 దాటిన గిట్టుబాటు ధర
న్యూస్‌టుడే, పెద్దేముల్‌, వికారాబాద్‌

ళ్ల తరబడి పసుపు పంటను నమ్ముకుని సాగు చేసి బతుకుతున్న రైతన్నల ఈసారి మంచి శుభ వార్త వినిపిస్తోంది. పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా క్వింటాల్‌ పసుపు ధర రూ.20,000 పలుకుతోంది. పెట్టుబడి ఖర్చులు పెనుభారంగా మారినా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందకపోయినా సంప్రదాయ పంటగా పసుపును సాగు చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకున్నా ఏళ్ల తరబడి సాగును వదల్లేదు. నీటి సౌకర్యం ఉన్న రైతులు ఈ పంటను సాగు చేస్తూ వస్తున్నారు. ఎప్పటికైనా కలిసి వస్తుందన్న ఆశ వీరిని ముందుకు నడిపిస్తే ఈసారి అంచనాలకు మించి గిట్టుబాటు కావడం రైతులకు సంతోషాన్ని నింపింది.

పదేళ్ల తరువాత మళ్లీ వచ్చింది

జిల్లాలో పసుపు గిట్టుబాటు ధర 2011లో క్వింటాలు రూ.13,400 పలికింది. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2015లో రూ.10,000 ధర వచ్చింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు (2024) రూ.15,000కు పైగా ధర పలుకుతోంది. రైతుల ఊహించని విధంగా ఈ ఏడాది గతం కంటే రెట్టింపు ధర పలుకుతోంది. పంట ధర సగటున రూ.10 వేలకు పైగా పలకడంతో పచ్చ బంగారంపై కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి.

బెడ్‌ పద్ధతిని అనుసరిస్తున్న రైతులు

పసుపు సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు కొత్తగా బెడ్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు. సాధారణ సాగు విధానంలో రైతులు ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు పంటను తీసే వారు. అయితే బెడ్‌ పద్ధతి వచ్చిన తర్వాత ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. ఎకరాలకు రూ.లక్ష వరకు పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధర స్థిరంగా కొనసాగితే రైతులకు మంచి లాభాలు వస్తాయి. మార్కెట్‌ సౌకర్యం, గిట్టుబాటు ధర ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంది.

చిగురిస్తున్న ఆశలు

పసుపు ధర పెరగడంతో రైతుల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. వచ్చే ఏడాది పంట సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది పొలాలను దుక్కి దున్నారు. కోడి ఎరువులను కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇస్తున్నారు. జిల్లాలో 3 వేల ఎకరాల్లో పంట సాగు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బావులు, బోర్లు, వాగుల సౌకర్యం ఉన్న రైతులు పెద్ద మొత్తంలో సాగు చేయడానికి సిద్ధం అవుతున్నారు.


ప్రోత్సాహం కరవైనా సాగునువదల్లేదు

వాణిజ్య, సుగంధ పంటగా పేరొందిన పసుపు పంటను జిల్లా రైతులు ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరవైనా, గిట్టుబాటు ధర, మార్కెట్‌ సౌకర్యం లేకున్నా పంట సాగు వదల్లేదు. సాగు విస్తీర్ణం తగ్గినా ఎప్పుడో ఓ రోజు ధర వస్తుందన్న నమ్మకంతో కొంత భూమిలో ఈ పంటను పండిస్తున్నారు. స్వల్పకాలిక పంటలు అందుబాటులో ఉన్నా కొందరు రైతులు దీర్ఘకాలిక రకమైన పసుపును సాగు చేస్తూ వస్తున్నారు.

 ‘లక్ష్మీ’ పంటగా పిలిచే పసుపును జిల్లాలోని పెద్దేముల్‌, ధారూర్‌, బంట్వారం, మర్పల్లి, మోమిన్‌పేట, పరిగి, వికారాబాద్‌, నవాబుపేట మండలాల్లో 2 వేల ఎకరాల్లో ఈసారి సాగు చేశారు. ప్రస్తుతం విస్తీర్ణం తగ్గి వేయి ఎకరాలు కూడా సాగు కావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని