logo

సెల్‌టవర్ల పరికరాల చోరీ

ఎయిర్‌టెల్‌, జియో కంపెనీల సెల్‌టవర్లపై బిగించే ‘రిమోట్‌ రేడియో హెడ్‌ (ఆర్‌ఆర్‌హెచ్‌), రిమోట్‌ రేడియో యూనిట్‌(ఆర్‌ఆర్‌యూ), బేస్‌ బ్యాండ్‌ యూనిట్లు (బీబీయూ), టవర్‌ కేబుల్‌, ఇతర పరికరాలు చోరీ చేస్తున్న తొమ్మిది మంది ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

Published : 27 Mar 2024 01:35 IST

తొమ్మిది మంది ఉన్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఎయిర్‌టెల్‌, జియో కంపెనీల సెల్‌టవర్లపై బిగించే ‘రిమోట్‌ రేడియో హెడ్‌ (ఆర్‌ఆర్‌హెచ్‌), రిమోట్‌ రేడియో యూనిట్‌(ఆర్‌ఆర్‌యూ), బేస్‌ బ్యాండ్‌ యూనిట్లు (బీబీయూ), టవర్‌ కేబుల్‌, ఇతర పరికరాలు చోరీ చేస్తున్న తొమ్మిది మంది ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ యంత్రాలను టవర్‌లకు బిగించిన నిపుణులే చోరీ చేయడం గమనార్హం. నిందితుల నుంచి సుమారు రూ.80 లక్షల ఎయిర్‌టెల్‌ 4జీ ఆర్‌ఆర్‌యూలు 13, 5జీ ఆర్‌ఆర్‌యూ 1, జియో 4జీ ఆర్‌ఆర్‌హెచ్‌లు 8, 600 మీటర్ల కేబుల్‌ తీగ, 10 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ సీసీఎస్‌లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జకీర్‌ హుస్సేన్‌, అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావుతో కలిసి డీసీపీ(టాస్క్‌ఫోర్స్‌) ఎస్‌.రష్మీ పెరుమాళ్‌ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం దేవలతండాకు చెందిన బనావత్‌ నాగరాజు(23), మోత్‌ నగేష్‌ అలియాస్‌ వరుణ్‌ చదువు పూర్తి చేసి వచ్చి ఎల్బీనగర్‌లో ఉంటున్నారు. ఎయిర్‌టెల్‌లో ‘టవర్‌ రిగ్గర్‌’ (టవర్లపై యంత్ర పరికరాలు బిగించే నిపుణులు)గా చేరారు. శ్రీకాకుళంకు చెందిన జె.వెంకటరమణ నిర్వహించే ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌, సమ్మిట్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో సబ్‌ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. సంపాదన సరిపోక ఆర్‌ఆర్‌యూ, ఆర్‌ఆర్‌హెచ్‌, బీబీయూలు అపహరించాలనుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టవర్లపై ఆ పరికరాలను వీరే బిగిస్తారు. మరుసటి రోజో లేక గంటల వ్యవధిలో వాటిని చోరీ చేస్తారు. సరూర్‌నగర్‌కు చెందిన చుక్కోలు శివ(22), మల్లేపల్లిలో ఉంటున్న యూపీ రాష్ట్రం మేరట్‌ జిల్లా కాన్షీ గ్రామానికి చెందిన కంప్యూటర్‌ స్క్రాప్‌ వ్యాపారి దిల్షాద్‌ మల్లిక్‌ (24), రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ పహాడీషరీఫ్‌ ఎంఎం కాలనీలో ఉంటున్న యూపీ మేరట్‌ జిల్లా మావాన గ్రామానికి చెందిన చాంద్‌ మాలిక్‌(29), మల్లేపల్లిలో ఉంటున్న యూపీ మేరట్‌ జిల్లా జమ్నానగర్‌ గ్రామానికి చెందిన కంప్యూటర్‌ స్క్రాప్‌ వ్యాపారి షహర్యాన్‌ మాలిక్‌(20), నాంపల్లి హబీబ్‌నగర్‌ నాలా వద్ద ఉంటున్న మేరట్‌ వాసి కంప్యూటర్‌ స్క్రాప్‌ వ్యాపారి సోహెల్‌ మాలిక్‌ (20)లకు అందజేస్తారు. వీరు పరికరాలను దిల్లీలో విక్రయిస్తారు. పరికరాలను దేశంలో ఎక్కడ ప్రయోగించిన దొరికిపోతారు కాబట్టి ఎల్లలు దాటిస్తున్నారు. ఒక్కో పరికరాన్ని రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు విక్రయిస్తున్నారు. నాగరాజు, నగేష్‌పై కాచిగూడ, ఖైరతాబాద్‌, ఎస్‌.ఆర్‌.నగర్‌, మధురానగర్‌, మీర్‌పేట్‌ (రాచకొండ), వనస్థలిపురం, నాగోల్‌, హయత్‌నగర్‌, బాలానగర్‌(సైబరాబాద్‌), శంషాబాద్‌ ఠాణాల్లో కేసులున్నాయి.

జియో పరికరాల దొంగలు: నల్గొండ జిల్లాకు చెందిన నీరుడు చైతన్య, ఎల్‌.రవినాయక్‌ జియో నెట్‌వర్క్‌లో టవర్‌ రిగ్గర్లుగా చేరారు. కొద్ది రోజులకే రవినాయక్‌ ఉద్యోగాన్ని వదిలి ఆటో నడుపుతున్నాడు. సంపాదన సరిపోక చైతన్యతో కలిసి ఆర్‌ఆర్‌హెచ్‌, ఇతర పరికరాలను చోరీ చేసి అమ్ముకోవడం మొదలుపెట్టారు. చైతన్య, రవినాయక్‌పై రాచకొండ కమిషనరేట్‌ ఆదిభట్ల, సంగారెడ్డి జిల్లా భానూర్‌(బీడీఎల్‌) ఠాణాల్లో కేసులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని