logo

సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

సీఆర్‌పీఎఫ్‌ రికార్డు అసిస్టెంట్‌ (కానిస్టేబుల్‌)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్‌ అధికారులపై నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కొరడా ఝళిపించారు.

Updated : 28 Mar 2024 06:54 IST

కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చేశారని చర్యలు

షాకీర్‌ అలీ, సీఐ బండ్లగూడ, వెంకటేశ్వర్‌జీ, ఎస్సై

కేశవగిరి, న్యూస్‌టుడే: సీఆర్‌పీఎఫ్‌ రికార్డు అసిస్టెంట్‌ (కానిస్టేబుల్‌)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్‌ అధికారులపై నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కొరడా ఝళిపించారు. ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ షాకీర్‌అలీ, ఎస్సై వెంకటేశ్వర్‌జీ, కానిస్టేబుల్‌ రమేష్‌లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు పురోగతిని తెలుసుకునేందుకు రాగా సీఐ దురుసుగా మాట్లాడారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన రికార్డింగ్‌లతో బాధితురాలు సీపీకి ఫిర్యాదు చేసింది.

అసలేం జరిగింది..

చాంద్రాయణగుట్ట సీఆర్‌పీఎఫ్‌(సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌)లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ముఖలింగం పదవి విరమణ చేశారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కావడంతో ఆయన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. పెట్రోకారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య సీఆర్‌పీఎఫ్‌లోనే రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దంపతులిద్దరూ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌లోని క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ముఖలింగం నివసించే క్వార్టర్స్‌కు చెందిన నలుగురు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు మద్యం తాగారు. కిందకు వచ్చి ముఖలింగం పార్కు చేసిన కారు సమీపంలో మూత్ర విసర్జన చేశారు. గమనించిన ఆయన వారిని ప్రశ్నించాడు. కారు వద్ద చేయలేదని..పక్కనే ఉన్న చెత్తాచెదారం వద్ద మూత్ర విసర్జన చేశామని వారు జవాబిచ్చారు. దీంతో వారి మధ్య వివాదం తలెత్తింది. నలుగురు ఆయనపై చేయి చేసుకున్నారు. ఆయన అరవడంతో భార్య కిందికొచ్చి వారిని నిలదీసింది. అదే క్వార్టర్స్‌లో ఉన్న నలుగురు కానిస్టేబుళ్ల సతీమణులు కూడా రావడంతో వివాదం ముదిరింది. ముఖలింగం భార్యపైనా వారు దాడిచేశారు. అవమాన భారంతో ముఖలింగం భార్య బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సీఐ మహ్మద్‌ షాకీర్‌ అలీ ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేశ్వర్‌జీ కేసు దర్యాప్తు చేసి నిందితులను ఠాణాకు పిలిపించారు. 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి వారిని పంపించివేశారు. తమపై దాడి కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. పురోగతి ఏంటని అడిగేందుకు ముఖలింగం భార్య ఠాణాకు వచ్చి సీఐ షాకీర్‌అలీని ఇటీవల కలిసింది. సీఐ అమర్యాదగా, దురుసుగా మాట్లాడారంటూ బాధితురాలు ఆ సంభాషణను చరవాణిలో రికార్డు చేసింది. దీనిపైనా సీఐ అభ్యంతరం చెప్పిట్లు సమాచారం. బాధితురాలు రికార్డింగ్‌ తీసుకెళ్లి సీపీని కలిసి తన ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సీపీ కఠిన చర్యలు చేపట్టారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఒకే ఠాణాకు చెందిన సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెండ్‌ కావడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని