logo

భూ వినియోగ మార్పిడి దస్త్రాల్లో కదలిక

ఎట్టకేలకు హెచ్‌ఎండీఏ పరిధిలోని భూ వినియోగ మార్పిడి(ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్‌) దస్త్రాలకు మోక్షం లభించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Published : 29 Mar 2024 03:50 IST

ఎన్నికల తర్వాత పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలనకు సర్కారు సుముఖం

ఈనాడు, హైదరాబాద్‌: ఎట్టకేలకు హెచ్‌ఎండీఏ పరిధిలోని భూ వినియోగ మార్పిడి(ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్‌) దస్త్రాలకు మోక్షం లభించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ వినియోగ మార్పిడి జరగక నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. స్థిరాస్తి రంగంపై  ఈ ప్రభావం పడుతుండటంతో విషయం ఇటీవల ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్పిడి ప్రక్రియను లోక్‌సభ ఎన్నికల అనంతరం కొనసాగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం జోన్ల వారీగా భూ వినియోగ కేటాయింపులు ఉంటాయి.  గత సర్కారు హయాంలో భారీ ఎత్తున భూ వినియోగ మార్పిడులు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ముందు 3-4 రోజులపాటు విచ్చలవిడిగా రోజుకు పదుల సంఖ్యలో జీవోలు ఇచ్చారు. జీవో 111 పరిధిలోకి వచ్చే వట్టినాగులపల్లిలోని వందల ఎకరాలను అక్రమంగా మార్పిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో చక్రం తిప్పిన ఓ కీలకాధికారి కనుసన్నల్లో ఈ తతంగం యథేచ్ఛగా నడిచింది. ఇటీవల ఏసీబీకి చిక్కిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొత్త ప్రభుత్వం ఈ వ్యవహారంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు భూ వినియోగ మార్పిడి దస్త్రాలను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతర దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా మార్పిడి ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో వందకుపైగా అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని