logo

బల్దియా హస్తగతం!

గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేయడానికి అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అనేక పురపాలక సంఘాలు, నగరపాలక సంఘాల పరిధిలో గత ఎన్నికల్లో భారాస అభ్యర్థులు గెలిచినా కూడా చాలా చోట్ల వీరంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

Published : 29 Mar 2024 03:53 IST

ప్రత్యేక వ్యూహంతో ఆపరేషన్‌ ఆకర్ష్‌..
30న కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్‌, మరికొందరు కార్పొరేటర్లు సైతం

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేయడానికి అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అనేక పురపాలక సంఘాలు, నగరపాలక సంఘాల పరిధిలో గత ఎన్నికల్లో భారాస అభ్యర్థులు గెలిచినా కూడా చాలా చోట్ల వీరంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో పాలకవర్గాలన్నీ కాంగ్రెస్‌ చేతికి వస్తున్నాయి. ఇదే విధంగా బల్దియాలో కూడా అధిక శాతం కార్పొరేటర్లను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా ఎంఐఎం తోడ్పాటుతో హస్తగతం చేసుకోవాలని పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా బల్దియా మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో ఇటీవల జరిపిన చర్చలు సఫలం కావడంతో.. శనివారం ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆమె వెంట 5-10 మంది కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌లో చేరతారని నేతలు చెబుతున్నారు.

డివిజన్‌ స్థాయిలో బలోపేతానికి..

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుని సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ బరిలో నిలిపింది. వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డిని సైతం కాంగ్రెస్‌లో చేర్చుకుని మల్కాజిగిరి నుంచి పోటీకి నిలిపారు. ఈ రెండు స్థానాల పరిధిలో 14 శాసనసభా నియోజకవర్గాలుండగా  ఒక్కచోట కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లేరు. మొన్నటి ఎన్నికల్లో ఈ స్థాలన్నింటిలోనూ భారాస అభ్యర్థులు గెలుపొందారు. ఈ నేపథ్యంలో నగర పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్‌ కాంగ్రెస్‌కు లేదనే చెప్పాలి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలకు వెళితే ఫలితాలు అనుకూలంగా రావని ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేయాలంటే డివిజన్లపై పట్టుసాధించాలని సీఎం భావించారు.

లోక్‌సభ ఎన్నికల్లో  విజయానికి ప్రణాళిక

గత బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఇద్దరే కార్పొరేటర్లు గెలిచారు. ఇటీవల పరిణామాలతో కొందరు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 10కి చేరింది. మరో 30 మంది కార్పొరేటర్లను  చేర్చుకోవాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరితే డివిజన్లలో పెద్దఎత్తున పనులు చేయించొచ్చన్న భావనలో కొందరు భాజపా, భారాస కార్పొరేటర్లు ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మేయర్‌ విజయలక్ష్మితో కాంగ్రెస్‌ పెద్దలు మాట్లాడారు. పార్టీలో చేరడానికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు. మేయర్‌ తండ్రి సీనియర్‌ భారాస నేత కె.కేశవరావు గురువారం మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మేయర్‌ విజయలక్ష్మి గురువారం సాయంత్రం ప్రకటించారు. ఆమెతోపాటు ఐదారుగురు కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్‌ శ్రీలత హస్తం గూటికి చేరారు. ఇప్పుడు వీరిద్దరు కాంగ్రెస్‌ ఆపరేషన్‌లో భాగం కానున్నారని చెబుతున్నారు. మరో రెండు వారాల్లో  మరింతమంది కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు భారాస పార్టీకి అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యూహం రూపొందించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని