logo

మిషన్‌ శక్తి.. మహిళా దీప్తి

మహిళలు, బాలికల భవితకు బాటలు వేసేందుకు సర్కార్‌ కృషి చేస్తోంది. ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదంతో వారిలో చైతన్యం తెస్తోంది.

Published : 30 Mar 2024 02:26 IST

మహిళలకు అవగాహన కల్పిస్తున్న అధికారిణి

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: మహిళలు, బాలికల భవితకు బాటలు వేసేందుకు సర్కార్‌ కృషి చేస్తోంది. ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదంతో వారిలో చైతన్యం తెస్తోంది. ఇందులో భాగంగానే బాలికల కోసం గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు ఏర్పాటు చేసింది. వీటిని సద్వినియోగం చేసుకునేలా ‘మిషన్‌ శక్తి’ బృందం సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మిషన్‌ శక్తి సమన్వయకర్త, జెండర్‌ స్పెషలిస్టు, ఆర్థిక అక్షరాస్యత సభ్యుడు, గుమాస్తా, మల్టిపర్సస్‌ టాస్క్‌ సిబ్బంది, క్షేత్ర సిబ్బంది ఉంటారు.

సదస్సులు.. సమావేశాలు

ఈ బృందం సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తూ మహిళా సమావేశాలను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పిస్తున్నారు. బాలికల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, బాల్య వివాహాలు చేయవద్దని, ఒక వేళ చేస్తే వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు. బాలికల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆడ, మగ తేడాలు లేకుండా మగ పిల్లవాడితో సమానంగా బాలికలను చూడాలని గ్రామీణులకు వివరిస్తున్నారు. బాలికలు డిగ్రీ, పీజీ చదివేందుకు ప్రోత్సహించేలా చైతన్యం తీసుకువస్తున్నారు.

చట్టాల గురించి

చిన్నారులపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయి. చాలా సందర్భాల్లో ఈ సంఘటనలు బయటకు రావడం లేదు. ఇటువంటి వ్యవహారాల్లో బంధువులు, స్నేహితులు, దగ్గరివారు ఉండడంతో గుట్టుగా ఉంటున్నారు. ఈలాంటి సంఘటనలకు గురైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలపాలని సూచిస్తున్నారు. పోక్సో చట్టం ద్వారా వికృత చేష్టలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటారని వివరిస్తున్నారు. ఆడ పిల్ల అని తెలియగానే, బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా చేయడం చట్టవ్యతిరేకమని తెలుపుతున్నారు. మహిళా చట్టాల గురించి వివరిస్తున్నారు.


ప్రతి నెలా 20 సదస్సులు
బలరామ్‌, జిల్లా సమన్వయకర్త  

మిషన్‌ శక్తి విభాగం ద్వారా ప్రతి నెలా గ్రామాల్లో 20 కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మహిళా హక్కుల గురించి తెలుపుతున్నాం. మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి వివరిస్తున్నాం. మహిళలకు చైల్డ్‌లైన్‌ 1098, మహిళా హెల్ప్‌లైన్‌ 181 గురించి వివరిస్తున్నాం.


ఆర్థికంగా ఎదిగేలా..
రాందాస్‌, ఆర్థిక అక్షరాస్యత సభ్యుడు

మహిళలు ఆర్థికపరంగా అన్ని రంగాల్లో ముందుండేలా వివిధ అంశాలను వివరిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాం. సుకన్య సమృద్ధి యోజన, పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, ముద్ర రుణాలు, పీఎంఈజీపీ పథకాల గురించి తెలియజేస్తున్నాం.


కార్యక్రమాలు ముమ్మరం: జ్యోతిపద్మ, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి

మిషన్‌ శక్తి విభాగంలో కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించాం. గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో సదస్సులు ఏర్పాటు చేసి మహిళా సాధికారత గురించి అవగాహన కల్పించాలని సూచించాం. ప్రణాళికతో ముందుకు సాగేలా కార్యాచరణ రూపొందించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని