logo

గృహ నిర్మాణ సముదాయంలో నిర్లక్ష్యపు పేలుళ్లు

నిర్మాణంలో ఉన్న గృహ సముదాయ ఆవరణలో ముందస్తు హెచ్చరికలు లేకుండా నిర్లక్ష్యంగా జరిపిన బ్లాస్టింగ్‌లో ఓ కార్మికుడు దుర్మరణం చెందగా మరొకరు చికిత్స పొందుతున్నారు.

Published : 30 Mar 2024 02:34 IST

ముందస్తు హెచ్చరికలు చేయకుండానే నిర్వాకం
ఇద్దరికి తీవ్ర గాయాలు, చికిత్స పొందుతూ ఒకరి మృతి

సంఘటన ప్రదేశం

మూసాపేట, న్యూస్‌టుడే: నిర్మాణంలో ఉన్న గృహ సముదాయ ఆవరణలో ముందస్తు హెచ్చరికలు లేకుండా నిర్లక్ష్యంగా జరిపిన బ్లాస్టింగ్‌లో ఓ కార్మికుడు దుర్మరణం చెందగా మరొకరు చికిత్స పొందుతున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పేలుళ్లు జరపడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మూసాపేట ఆంజనేయనగర్‌ను ఆనుకుని ఉన్న ఐడీఎల్‌ రోడ్డులో హానర్‌ సంస్థ పేరుతో భారీ గృహనిర్మాణ సముదాయ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఓవైపు భవన నిర్మాణం, మరోవైపు ఖాళీ స్థలంలోని పెద్ద పెద్ద బండరాళ్లను పేల్చుతున్నారు. వందల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. కేఎల్‌సీ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు కొనసాగుతుండగా పటేల్‌ మైనింగ్‌ సంస్థ బ్లాస్టింగ్‌ చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కార్మికులు భోజనానికి వెళ్లారు. అరగంట తర్వాత ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో సైరన్‌ వేయకుండా బ్లాస్టింగ్‌ జరగడంతో రాళ్ల శకలాలు అప్పుడే అక్కడికి వస్తున్న పలువురు కార్మికులపై పడ్డాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన హరిలాల్‌ మహానాథో(54), బిహార్‌ రాష్ట్రవాసి పంకజ్‌ ఆలం(32)పై శకలాలు పడ్డాయి. హరిలాల్‌ కాలు ఛిద్రం కాగా తలకు బలమైన గాయాలయ్యాయి. పంకజ్‌కు సైతం తీవ్రగాయాలయ్యాయి. మిగతా కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను అమోర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరిలాల్‌ మృతిచెందారు. పంకజ్‌ తీవ్రగాయాలతో అదే ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. హానర్‌, పటేల్‌ మైనింగ్‌ సంస్థలపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్‌ నియోజవకర్గ ఇన్‌ఛార్జి బండి రమేష్‌ ప్రమాదంపై ఆరా తీశారు.

చికిత్స పొందుతున్న పంకజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని