logo

సైబర్‌ మోసం.. కట్టడికి యోధులు సిద్ధం

నేటి ఆధునిక కాలంలో ఫోన్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. అదే సమయంలో డిజిటల్‌ లావాదేవీలు ఊపందుకోవడంతో చాలా మంది స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

Published : 16 Apr 2024 06:33 IST

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నియామకం
న్యూస్‌టుడే, వికారాబాద్‌

నేటి ఆధునిక కాలంలో ఫోన్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. అదే సమయంలో డిజిటల్‌ లావాదేవీలు ఊపందుకోవడంతో చాలా మంది స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా, పట్టణం అనే తేడా లేకుండా సైబర్‌ నేరాలు సైతం అధికమై అమాయకులు ఆర్థికంగా నష్టపోతున్నారు.వీటిని నియంత్రించేందుకు పోలీసుశాఖ ఇప్పటికే ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతూ, ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడకుండా చైతన్యం తెస్తున్నారు. అయినా పరిస్థితికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో బాధితులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రజలకు చేరువలోకి ‘సైబర్‌ వారియర్స్‌’ పేరిట ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

టోల్‌ ఫ్రీ నం.1930కు రోజుకు 4 ఫిర్యాదులు

సైబర్‌ నేరాలకు గురైన బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేయాలి. నేరం జరిగిన అనంతరం ఎంత త్వరగా సమాచారం ఇస్తే, అంత త్వరగా నేరాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. ఆలస్యమైతే పరిస్థితి చేజారి పోతుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం చాలా మంది బాధితులు టోల్‌ఫ్రీ నంబరును ఆశ్రయిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో టోల్‌ఫ్రీ నంబరుకు సగటున రోజుకు 4 ఫిర్యాదులు అందుతున్నాయి. బాధితులకు సత్వర సేవలు అందించేందుకు జిల్లాలో 19 పోలీస్‌ ఠాణాల్లో సైబర్‌ వారియర్స్‌ను సిద్ధం చేశారు.

వీళ్లు ఏం చేస్తారంటే..

సైబర్‌ వారియర్స్‌ను సంప్రదిస్తే, వారు నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్పీ)లో వివరాలు నమోదు చేస్తారు. ఎవరైనా 1930కి కాల్‌ చేసినా, అక్కడి నుంచి బాధితులు ఉన్న పోలీస్‌ఠాణా పరిధిలోని సైబర్‌ వారియర్స్‌కు సమాచారం చేరుతుంది.


హైదరాబాద్‌లో శిక్షణ, ప్రత్యేక సిమ్‌కార్డులు

ఈ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ప్రతి పోలీస్‌ఠాణాకు ఒక సైబర్‌ వారియర్‌ను నియమించారు. వీరికి హైదరాబాద్‌ కేంద్రంగా శిక్షణ అందించారు. అందరికీ ప్రత్యేకంగా సిమ్‌కార్డులు, ఫోన్లు అందించారు. పోలీస్‌ఠాణాల వారీగా ఆ నంబర్లు అందరికీ తెలిసేలా ప్రచారం చేపడుతున్నారు.


ఆందోళన వద్దు.. వెంటనే సమాచారం ఇవ్వండి. చర్యలు తీసుకుంటాం

- ప్రశాంత్‌రెడ్డి, డీఎస్పీ, జిల్లా సైబర్‌ క్రైం విభాగం.

బాధితులు ఏమాత్రం ఆందోళన చెందొద్దు. సైబర్‌ మోసానికి గురైనట్లు తెలిసిన వెంటనే పరిధిలోకి వచ్చే సైబర్‌ వారియర్‌కు సమాచారం అందించాలి. రద్దీతో టోల్‌ఫ్రీ నంబరు 1930 సంప్రదించడంలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకే ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సేవలు అందించేందుకు ప్రభుత్వం వారియర్స్‌ను నియమించింది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని