logo

హామీలు ఇచ్చి.. ఆశీర్వదించమని కోరి

రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల ఓట్లే లక్ష్యంగా నారాయణపేటలో కాంగ్రెస్‌ నిర్వహించిన జన జాతర సభ కొనసాగింది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివిధ వర్గాలకు పలు హామీలను గుప్పిస్తూ కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు.

Published : 16 Apr 2024 06:05 IST

భాజపాయే లక్ష్యంగా విమర్శలు
వివిధ వర్గాల మద్దతు ఇవ్వాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల ఓట్లే లక్ష్యంగా నారాయణపేటలో కాంగ్రెస్‌ నిర్వహించిన జన జాతర సభ కొనసాగింది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివిధ వర్గాలకు పలు హామీలను గుప్పిస్తూ కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగంలో సబ్బండ వర్గాల ప్రస్తావనే ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదిస్తే ముదిరాజ్‌ బిడ్డను ఆగస్టు 15 లోగా మంత్రిని చేస్తానని అనడంతో పక్కనే ఉన్న మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్‌ కాళ్లు మొక్కారు. ముదిరాజ్‌లను బీసీ-డి నుంచి బీసీ-ఏ లోకి మార్చాలంటే కేంద్రంలో పోరాడే వంశీచంద్‌రెడ్డి వంటి నాయకుడు ఎంపీగా ఉండాలని ఆయన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. దళితుల ఏబీసీడీ వర్గీకరణ కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమవుతుందని ఈ వర్గం ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. కుర్వ యాదవులకు టిక్కెటు ఇస్తే భారాస, భాజపాలు ఒక్కటై ఓడగొట్టారని విమర్శలు గుప్పించారు. షాద్‌నగర్‌లో రజకులకు పార్టీ టిక్కెటు ఇచ్చి గెలిపించిదన్నారు. కాంగ్రెస్‌ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాలమూరు జిల్లాలో వివిధ వర్గాలకు టిక్కెటు కేటాయించిందని ప్రజలకు వివరించి మద్దతు కోరే ప్రయత్నం చేశారు.  

భారాస-భాజపా ఒక్కటే అంటూ..: సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్‌ నేతలు భాజపానే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. భారాస, భాజపా కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. డీకే అరుణ గెలుపు కోసం భారాస పని చేస్తోందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో ఈ రెండు పార్టీలు  కాంగ్రెస్‌ను ఓడించడానికి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణపై విమర్శలు గుప్పించారు.


సీఎంకు ఘన స్వాగతం..

సీఎం సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నారాయణపేట రావడంతో జిల్లా ఎమ్మెల్యేలు పర్నికరెడ్డి, శ్రీహరి సీఎంకు ఘన స్వాగతం పలికారు. సభ ముగిసే వరకు పార్టీ సీనియర్‌ నేత కుంభం శివకుమార్‌రెడ్డి సీఎం వెంటే ఉన్నారు. వేదికపై కూర్చున్న ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నేతలను స్థానిక పద్మశాలీలు నేసిన శాలువాలతో సన్మానించారు. సాయంత్రం 6.30కు సీఎం నారాయణపేట చేరుకున్నారు. సభ ప్రాంగణానికి సాయంత్రం 6.55కు వచ్చారు. రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నాయకులు మాట్లాడారు. రాత్రి 7.58కు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రారంభి 36 నిమిషాల సేపు మాట్లాడారు. సభ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే పర్నికరెడ్డి తమ్ముడు అభిజయ్‌రెడ్డి సీఎంకి ఖడ్గాన్ని బహూకరించారు. అనంతరం రోడ్డు మార్గాన సీఎం హైదరాబాద్‌కు బయలుదేరారు.


వెన్నుపోటు తప్ప పేటకు చేసిందేమిటి?

- డీకే అరుణపై కాంగ్రెస్‌ ఎంపీˆ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి విమర్శలు.

నారాయణపేట, పేట పాతబస్టాండ్‌: నారాయణపేటలోనే పుట్టి పెరిగానని చెబుతున్న డీకే అరుణ ఈ జిల్లాకు ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా? అంటూ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ ఎంపీˆ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేట, కొడంగల్‌ తనకు రెండు కళ్లు వంటివన్నారు. ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని మూడు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని