logo

పర్యావరణ హితంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయి సదుపాయాలతో అందుబాటులోకి రానుంది.

Updated : 22 Apr 2024 05:20 IST

ఆరు వేల గజాల్లో పచ్చదనం
చకచకా అభివృద్ధి పనులు
2025 నాటికి పూర్తిస్థాయిలో సేవలు

హరితందాలు, ఆధునిక హంగులతో స్టేషన్‌ నమూనా..

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయి సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. రూ.719 కోట్లతో చేపడుతున్న ఈ పురాతన స్టేషన్‌ అభివృద్ధి పనుల్లో గ్రీనరీకి పెద్ద పీట వేస్తున్నారు. కనీసం ఆరువేల గజాల మేర పచ్చిక బయళ్లు, పూల వనాలతో నింపనున్నారు. సికింద్రాబాద్‌ పరిసరాల్లో విపరీతమైన కాలుష్యమున్న నేపథ్యంలో ఇక్కడ ఇంధన వనరులు కాపాడటం, వర్షపు నీటితో జలసంరక్షణ, వాడిన నీటినే మళ్లీ వాడే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిబింబాలతో నేరుగా సూర్యకాంతి స్టేషన్‌లోకి ప్రసరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేషన్‌లో సంచారం తక్కువ ఉండే ప్రాంతాల్లో మనుషులు వెళ్తేనే లైట్లు వెలిగేలా వ్యవస్థను నెలకొల్పుతున్నారు. పర్యావరణహితంగా నిర్మించి 2025కల్లా అందుబాటులోకి తీసుకురావాలన్నది ద.మ. రైల్వే ప్రణాళిక.

పార్కులు, పచ్చిక బయళ్లు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆవరణ మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో అందుబాటులోకి వస్తోంది. ఇందులో ఎకరానికి పైగా పచ్చిక బైళ్లు, పార్కులు ఉంటాయి. ఇండోర్‌ ప్లాంట్‌లు కూడా విరివిగా ఉంటాయి. పై అంతస్థుల్లో కూడా పచ్చిక బయళ్లు, మొక్కలు, పార్కులు ఉండేలా చూస్తున్నారు. వీటికి తోడు చుక్క నీరు వృథా కాకుండా అంతా రీసైక్లింగ్‌ ప్లాంటుకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు మూడు లక్షల లీటర్ల నీటిని మళ్లీ వినియోగించేలా చూస్తున్నారు. స్టేషన్‌ మొత్తమ్మీద.. జనసంచారం ఉంటేనే లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 38 ఎస్కలేటర్లు వస్తున్నాయి. ఫుడ్‌ కోర్టులు, మాల్‌ మాదిరి షాపింగ్‌, విశ్రాంతి గదులు, స్టార్‌ హోటల్‌ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

మెట్రో, ఆర్టీసీ అనుసంధానం..

ఇప్పుడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో దిగి సామాన్లతో మెట్రో స్టేషన్‌కు వెళ్లడం గగనంగా మారింది. ఈ స్టేషన్‌ నిర్మాణం జరిగితే ప్రతి ప్లాట్‌ఫాం నుంచి సులభంగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్టీసీ బస్సు స్టేషన్లకు కూడా నేరుగా స్టేషన్లోంచి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ఇరువైపులా ప్రజలు తిరిగేలా 12 మీటర్ల వెడల్పుతో పాదచారుల వంతెన రానుంది. సామాన్లతో సులభంగా నడుచుకుని వెళ్లాలా వంతెనలు ఉండనున్నాయి. ఇండోర్‌ గేమ్స్‌ కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతానికి 20 శాతం పనులు పూర్తయ్యాయి. ఆగస్టు 2025 నాటికి అందుబాటులోకి తీసుకు రావాలనుకున్నా.. 2026 నాటికి పూర్తి చేయాలని ద.మ. రైల్వే భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని