logo

ఉద్దండుల బరి హైదరాబాద్‌.. వెంకయ్యనాయుడు ఎప్పుడు పోటీ చేశారంటే?

హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం మొదటి నుంచి రాజకీయ ఉద్దండులకు వేదికగా ఉంది. తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ ఉర్దూకవి, కమ్యూనిస్టు నేత మగ్దూం మొయినోద్దీన్‌ పీడీఎఫ్‌ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ మొహియుద్దీన్‌ చేతిలో సుమారు 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Updated : 30 Apr 2024 07:23 IST

మగ్దూం మొయినోద్దీన్‌, బద్దం బాల్‌రెడ్డి, ఎం.వెంకయ్యనాయుడు, జి.ఎస్‌. మెల్కోటే

న్యూస్‌టుడే, చాంద్రాయణగుట్ట: హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం మొదటి నుంచి రాజకీయ ఉద్దండులకు వేదికగా ఉంది. తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ ఉర్దూకవి, కమ్యూనిస్టు నేత మగ్దూం మొయినోద్దీన్‌ పీడీఎఫ్‌ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ మొహియుద్దీన్‌ చేతిలో సుమారు 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జి.ఎస్‌.మెల్కోటే 1962, 1967 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం ఆయన తెలంగాణ ప్రజాసమితి నుంచి బరిలోకి దిగి గెలుపొందారు.

1984 ఎన్నికల్లో నాటి మజ్లిస్‌ అధినేత సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ(సలార్‌) ఈ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా ఆరు పర్యాయాలు సలావుద్దీన్‌ ఒవైసీ ఇక్కడి నుంచి గెలిచారు. 1984 ఎన్నికల్లో మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ హోం మంత్రులు ప్రభాకర్‌రెడ్డి, పి.ఇంద్రారెడ్డిలు సైతం ఇక్కడి నుంచి పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విజయం వారిని వరించలేదు. 1996 ఎన్నికల్లో ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్‌ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగి మజ్లిస్‌కు గట్టిపోటీ ఇచ్చారు. అప్పటి రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రస్తుత భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉండి ఓట్లు చీల్చడంతో వెంకయ్యనాయుడు ఓటమి పాలయ్యారు. భాజపా సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాటి హుడా ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం ఇక్కడి నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు. 2009 ఎన్నికల్లో సియాసత్‌ ఉర్దూ దినపత్రిక ఎడిటర్‌ జాహెద్‌అలీఖాన్‌ తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, కార్వాన్‌, వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. దీంతో మజ్లిసేతర పార్టీలు గట్టి పోటీ ఇచ్చేవి. అయితే వివిధ పార్టీల మధ్య ఓట్ల చీలికతో మజ్లిస్‌ 1984 నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో తాండూరు, చేవెళ్ల, వికారాబాద్‌ను నుంచి తొలగించి, వాటి స్థానంలో మలక్‌పేట, బహదూర్‌పుర, గోషామహల్‌ నియోజకవర్గాలను చేర్చారు. దీంతో గోషామహల్‌ మినహా మిగతా అన్ని సెగ్మెంట్లలో ముస్లిం మైనార్టీల ఓట్లు గణనీయంగా ఉండడంతో మజ్లిస్‌ తిరుగులేని శక్తిగా ఎదిగింది.  భాజపా హైదరాబాద్‌ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విరించి హాస్పిటల్స్‌ ఛైర్‌పర్సన్‌ కొంపెల్ల మాధవీలతను బరిలోకి దింపింది. ఆమె ప్రచారంలో దూసుకుపోతుండడంతో మజ్లిస్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థానంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని