logo

వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక

పట్టాలు దాటుతుండగా గూడ్స్‌ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.

Updated : 03 May 2024 03:25 IST

పోలీసుల అదుపులో బాలుడు ?

షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఇద్దరు మైనర్ల ప్రేమ వ్యవహారం.. ఆపై గర్భవిచ్ఛిత్తి జరిగిన ఘటనలో బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని షాద్‌నగర్‌ సీఐ ప్రతాపలింగం గురువారం తెలిపారు. ఈ వ్యవహారంలో గర్భానికి కారకుడైన బాలుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బాలిక రోజూ పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో బాలుడు వెంబడించేవాడని, ఈ క్రమంలోనే ఈ వ్యవహారం చోటుచేసుకున్నట్లు తెలిసింది. గర్భ విచ్ఛితి కోసం బాలుడు మాత్రలు ఎక్కడినుంచి తెచ్చాడన్న దానిపై తేలాల్సి ఉంది.


గూడ్స్‌ రైలు ఢీకొని వ్యక్తి మృతి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: పట్టాలు దాటుతుండగా గూడ్స్‌ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది. వికారాబాద్‌ రైల్వే ఎస్‌ఐ శంకరయ్య తెలిపిన వివరాలు.. పట్టాలు దాటుతుండగా గూడ్స్‌ రైలు ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒంటిపై కట్‌ బనియన్‌, బ్లూ కలర్‌ జీన్స్‌ ఉంది. మృతుని దగ్గర వికారాబాద్‌ నుంచి బీదర్‌కు ప్రయాణించడానికి రైలు టిక్కెట్‌ లభించింది. చిరునామా తెలిపే ఎలాంటి వివరాలు లభించలేదు. మృతుని తాలూకూ ఎవరైనా 9989355134కు ఫోన్‌ చేయాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


సాంబారులో పడి ఒకరికి గాయాలు

ధారూర్‌: ప్రమాదవశత్తు సాంబారులో పడి ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో భారాస కార్యకర్తల సమావేశం అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కుక్కింద గ్రామానికి చెందిన గోరెంకల మల్లేశం అనే వ్యక్తి క్యూలైన్లో రాకుండా వంట పాత్రలు వైపు వెళ్లి జారి సాంబారు పాత్రలో పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని వికారాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.  


రైల్లో 5 కిలోల గంజాయి స్వాధీనం

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ నుంచి ముంబయి వెళ్తున్న రైల్లో గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాండూరు రైల్వే పోలీసులు గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలు.. సికింద్రాబాద్‌ నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆ శాఖ పోలీసులు శంకరయ్య, వీరేషం తదితరులు విధుల్లో భాగంగా తనిఖీలు చేపట్టారు. రుక్మాపూరు-  తాండూరు స్టేషన్ల మధ్యకు రాగానే ఎస్‌4 కోచ్‌లో పోలీసులకు ఓ సంచి లభించింది. ఎవరిదని ప్రయాణికులను ప్రశ్నించినా ఎవరూ తమదని ముందుకు రాలేదు. అనుమానం వచ్చి సంచిని విప్పి చూడగా ఐదు కిలోల గంజాయి ఉంది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని సంఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని