logo

ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్‌ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది.

Published : 03 May 2024 03:29 IST

సద్వినియోగానికి సహకారం

ఇలాంటి అవస్థలు పడాల్సిన పనిలేదు (పాత చిత్రం)

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్‌ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఇలాంటి సమస్యలను దూరం చేయడానికి తొలిసారిగా ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుండగా జిల్లాలో కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. 

329 మంది అర్హులు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయిన 5 రోజుల తర్వాత ఇంటి వద్దే ఓటు వేయడానికి దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఇందుకోసం ఫారం 12డీని పూర్తి చేసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి గాని సహాయ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో గానీ అందజేసే విధంగా సూచించారు. ఇంటి వద్ద ఓటింగ్‌ వేయటానికి ఎవరంటే వారికి అవకాశం ఇవ్వలేదు. 85 ఏళ్ల పైబడిన వయోవృద్ధులు, పూర్తిగా నడవలేని, కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేని పరిస్థితి ఉన్న వారిని అర్హులుగా గుర్తించారు. 40 శాతం పైగా వికలత్వం ఉన్న దివ్యాంగులు, అత్యవసర సేవలు అందించే వారు, కొవిడ్‌ రోగులు కూడా అర్హులుగా పేర్కొన్నారు.  

జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో ఇంటి వద్ద ఓటు వేయడానికి 409 మంది ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వారి ఇళ్లకు వెళ్లి పరిశీలించి 329 మందిని అర్హులుగా గుర్తించారు.

ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ  

ఇంటి వద్ద ఓటు వేసే ప్రక్రియ మొత్తం వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. ఇదంతా గోప్యంగా జరుగుతుంది. పోలింగ్‌ అధికారి, బూత్‌స్థాయి అధికారి, వీడియోగ్రాఫర్‌, పోలీసు అధికారి సమక్షంలో ఓటు వేసే కార్యక్రమం సాగుతుంది. ఓటు వేయడానికి గాను ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్‌, ఎలక్ట్రానిక్‌ మిషన్‌, ఈవీఎంను ఇంటికి తీసుకు వెళ్తారు. ఓటు వేయడం పూర్తి అయిన తర్వాత వీటిని ఆర్‌ఓ కార్యాలంలో భద్రపరుస్తారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని