logo

అన్నీ ఒకేచోట.. ఇబ్బంది లేదిక

ఇంధనాలన్నీ ఒకే చోట ఉండేలా కొత్త బంకులు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతుండటంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లను నెలకొల్పారు.

Updated : 05 May 2024 06:26 IST

బంకుల్లో అన్ని రకాల ఇంధనాలు
కొత్తగా ఈవీ ఛార్జింగ్‌ యూనిట్ల ఏర్పాటు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

మొయినాబాద్‌లో నిర్మాణ దశలో ఉన్న బంకు

ఇంధనాలన్నీ ఒకే చోట ఉండేలా కొత్త బంకులు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతుండటంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లను నెలకొల్పారు. కొత్తగా నిర్మిస్తున్న బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌తోపాటు ఈవీ ఛార్జింగ్‌ మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈవీలు సైతం బంకుల బాట పట్టనున్నాయి. ఇందుకు అనుగుణంగా నిర్వాహకులు వసతులు కల్పిస్తున్నారు. ఈ తరహా బంకులు ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కాగా.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.

50 సెంట్ల విస్తీర్ణంలో..

కనీసం 50 సెంట్ల స్థలంలో కొత్త బంకుల నిర్మాణం జరుగుతోంది. ఇందులో 50 శాతం స్థలాన్ని పెట్రోల్‌, డీజిల్‌ పంపులు, ఈవీ ఛార్జింగ్‌ మిషన్ల ఏర్పాటుకు కేటాయించారు. మిగిలిన స్థలాన్ని పచ్చదనం పెంపొందించేందుకు, ఈవీ వాహనదారులు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, మరుగుదొడ్లు, రెస్టారెంట్‌ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. ఛార్జింగ్‌ సమయంలో నిరీక్షించడానికి ఏసీ, ఫర్నీచర్‌తో కూడిన విశ్రాంతి గదులతో పాటు రెస్టారెంట్‌, కాఫీ షాపులు నిర్మిస్తున్నారు. అధునాతన సాంకేతికతతో కూడిన మరుగుదొడ్లు ఏర్పాటవుతున్నాయి.ఈ తరహా బంకులు మొయినాబాద్‌, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉండగా.. సికింద్రాబాద్‌లో ఇటీవల ఓ బంకును ప్రారంభించారు.

పెరుగుతున్న ఈవీల వినియోగం

రాష్ట్రవ్యాప్తంగా 2021 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 14 వరకు సుమారు 1.40 లక్షల ఈవీ వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో సుమారు 80 శాతం నగరానికి చెందినవే.ఓ సంస్థ నివేదిక ప్రకారం.. విద్యుత్తు కార్లను ఫుల్‌్ ఛార్జ్‌ చేసేందుకు 20 నుంచి 30 యూనిట్ల విద్యుత్తు అవసరం. దీని కోసం ఛార్జర్‌ సామర్థ్యం బట్టి 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. బైక్‌లకు ఫుల్‌ఛార్జింగ్‌ పెట్టడానికి సుమారు 4 గంటలు పడుతుంది. దీంతో కొత్త బంకుల యజమానులు వసతులు కల్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని