logo

చివరి ప్రయత్నంగా.. సకుటుంబ సమేతంగా

కష్ట సుఖాల్లో, మంచి చెడుల్లో మన వెంట ముందుండి నడిచేది కుటుంబం మాత్రమే. మన గెలుపోటముల వెంట నిలిచేది వారే. పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Updated : 09 May 2024 04:13 IST

నేతల తరఫున రంగంలోకి కుటుంబ సభ్యులు

 ప్రజల్లో కలిసిపోతూ తమవారి గెలుపు కోసం కృషి

చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తరఫున ఆయన సతీమణి డాక్టర్‌ సంగీతారెడ్డి మొయినాబాద్‌ మండలంలో ప్రచారంలో పాల్గొన్నారు. చిలుకూరులో స్వయంగా కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు.

ఈనాడు, హైదరాబాద్‌: కష్ట సుఖాల్లో, మంచి చెడుల్లో మన వెంట ముందుండి నడిచేది కుటుంబం మాత్రమే. మన గెలుపోటముల వెంట నిలిచేది వారే. పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా హోరెత్తిస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ అభ్యర్థులకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ గెలిపిస్తే తప్పకుండా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇస్తున్నారు. భర్తల తరఫున భార్యలు ప్రచారం చేస్తూ మహిళలకు బొట్టు పెట్టి మరీ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తండ్రులకు మద్దతుగా కుమారులు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగ, వ్యాపార బాధ్యతల్లో ఉన్నవారు సైతం తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టి తిరుగుతున్నారు. కొందరు నేరుగా అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తుంటే మరికొందరు తెరవెనుక అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎవరి తరఫున ఎవరెవరంటే..

చేవెళ్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తరఫున ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ గెలిపించాలని కోరుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి భాజపా నుంచి బరిలో ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వైపు నుంచి ఆయన భార్య డాక్టర్‌ సంగీతరెడ్డి ప్రచారంలోకి దిగారు. కాలనీలు, గ్రామీణ ప్రాంతాల్లో కలియ తిరుగుతున్నాయి. ఉదయాన్నే మార్నింగ్‌ వాకర్స్‌ను కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి ఇద్దరు కుమారులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరఫున భార్యతోపాటు కోడలు క్షమిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో తిరుగుతూ ఈటల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం తరఫున కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానంకు మద్దతుగా  నటుడు అల్లుఅర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఓటర్లను కలుస్తున్నారు. మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతకు అండగా ఆమె భర్త మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డికి మద్దతుగా ఆయన భార్య కావ్య, కుమార్తె ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ గెలుపు కోసం ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అన్నీ తానై శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రచార పర్వం ముగియడానికి మరో 3 రోజులే ఉండడంతో అభ్యర్థుల కుటుంబసభ్యులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంలో నిమగ్నమై ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని