logo

కమలం వెంటుంది.. అభివృద్ధి ముందుంది

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటరు అవసరం. ఐటీ కారిడార్‌ను ఇటువైపు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది.

Updated : 09 May 2024 05:40 IST

విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న మల్కాజిగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్

 

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటరు అవసరం. ఐటీ కారిడార్‌ను ఇటువైపు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక కారిడార్‌ వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.  ః సికింద్రాబాద్‌ - మేడ్చల్‌, సికింద్రాబాద్‌ - ఘట్‌కేసర్‌, నేరుగా ఐటీ కారిడార్‌కు ఎంఎంటీఎస్‌ సర్వీసులను పెంచేందుకు కృషి చేసి ప్రజారవాణాను పటిష్టం చేస్తాను.  ః  జీహెచ్‌ఎంసీలో భాజపాకు పట్టుంది. ఇక్కడి ఓటర్లు చాలా చైతన్యవంతులు. భారాసకు ఓటేసినా ప్రయోజనం లేదు. కాంగ్రెస్‌ కేంద్రంలో వచ్చేది లేదు. అందుకే భాజపాకు ఓటేస్తారు.  ః ఈసారి లక్‌ నాదే. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తుంది. ఇక్కడ విజయం సాధించడమే నా ముందున్న లక్ష్యం. తర్వాత పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తాను. మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తాను.

 ‘‘మల్కాజిగిరిలో ప్రజలే కథానాయకులుగా నిలబడి నన్ను గెలిపిస్తారు. మూడోసారి మోదీ ప్రధాని అవుతున్నారు. అభివృద్ధి ఎవరితో సాధ్యమో ఇక్కడి ఓటర్లకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ ఎన్నికల్లో నాకే విజయం కట్టబెడతారనే నమ్మకం ఉంది. నియోజకవర్గంలో దేశంలోనే అత్యధిక ఓటర్లున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.’’ అని మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలు, ప్రాధామ్యాలు, ఇతర అంశాలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గమైనా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వందల సంఖ్యలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. వీటికి పూర్వవైభవం తీసుకురావాల్సి ఉంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుతో భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి. ఈ ప్రాంతాన్ని చక్కటి పార్కులు, చెట్లతో సుందరీకరించాలి. మురుగునీటి వ్యవస్థను   ఏర్పాటు చేయాలి.
మీ విజయానికి దోహదపడే అంశాలు ఏంటి?
మోదీ తిరుగులేని నాయకుడు. మూడోసారి ప్రధాని అవుతున్నారు. ఈ పదేళ్లలో దేశాన్ని సుభిక్షంగా, భద్రంగా ఉంచడంతో పాటు అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. 23 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉంటున్నాను. నాదంతా ప్రజా జీవితం, నేను తెలియని వారు ఉండరు. ఇవన్నీ నా విజయానికి దోహదపడతాయి. భాజపా విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే అన్ని సంక్షేమ పథకాలు అందేలా చేస్తాం. పేదలకు ఇళ్లు కట్టిస్తాం.

మీ ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?
కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు ఎవరూ నా ప్రత్యర్థులు కారు. ఇక్కడి ఓటర్లు ఏకపక్షంగా నన్నే గెలిపిస్తారని పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో భాజపా విజయం సాధించే సీట్లలో మొట్టమొదటి స్థానం మల్కాజిగిరి నియోజకవర్గానిదే.
మిమ్మల్ని స్థానికేతరుడు అంటున్న వారికి మీరిచ్చే సమాధానం?
మల్కాజిగిరి నియోజకవర్గం నడిబొడ్డున నా ఇల్లు ఉంది. 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. పుట్టింది కమలాపూర్‌లోనైనా హైదరాబాద్‌లోనే చదువుకున్నా. అందుకే ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నా. ఇక్కడ అన్నివర్గాల ప్రజలతో మమేకమై ఉన్నాను. ఉద్యమ బిడ్డగా, మంత్రిగా, మచ్చలేని వ్యక్తిగా అందరికీ నేను సుపరిచితమే. నేను పక్కా లోకల్‌. గతంలో ప్రశ్నించే గొంతుకనవుతానని ప్రజలను మభ్యపెట్టి రేవంత్‌రెడ్డి గెలిచి ఐదేళ్లు ఈ ప్రాంతానికి రాలేదు. ఇప్పుడు మళ్లీ వస్తున్నారు.
ప్రజారవాణా మెరుగుకు ఏం చేస్తారు?
అడుగడుగునా రైల్వే గేట్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో రైల్వే లైన్లున్నా లోకల్‌ రైళ్ల ప్రయాణం లేదు. మేడ్చల్‌, ఉప్పల్‌, ఘట్‌కేసర్‌లో పైవంతెనలు కావాలి. మల్కాజిగిరిలో మెట్రో రైలు రావాలి. ఎంఎంటీఎస్‌ రెండోదశ అందుబాటులోకొచ్చినా రైల్వే వంతెనల్లేక తిప్పలేకపోతున్నారు. ప్రజారవాణాను పటిష్టం చేస్తాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని