logo

నాలాల్లో తేలుతున్న ప్రాణాలు

వానలు మొదలవడంతోనే.. మంగళవారం ఇద్దరు అమాయకులు బేగంపేట వద్ద నాలాలో పడి చనిపోయారు.

Updated : 09 May 2024 04:10 IST

బేగంపేటలో ఇద్దరు మృతితో నగరవాసుల్లో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: వానలు మొదలవడంతోనే.. మంగళవారం ఇద్దరు అమాయకులు బేగంపేట వద్ద నాలాలో పడి చనిపోయారు. వర్షాకాలం పూర్తయ్యే నాటికి ఇలాంటి దారుణాలు ఎన్ని చోటుచేసుకుంటాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంజినీర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందనే విమర్శలొస్తున్నాయి. నాలా నిర్మాణ పనులు, పూడికతీత, నాలా సేఫ్టీ ఆడిట్‌, భద్రతా చర్యల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని కొందరు అవినీతి ఇంజినీర్లు దారి మళ్లిస్తున్నారు. సద్వినియోగం అవ్వాల్సిన నిధులు.. వ్యక్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి. సాఫీగా సాగిపోవాల్సిన వరద.. జనాలను బలి తీసుకుంటోంది. రూ.కోట్లు ఖర్చవుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావట్లేదు.

ప్రమాదాలకు కారణాలివే.. రూ.985కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల కిందట వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఎన్‌డీపీ) మొదలైంది. సుమారు రూ.650 కోట్లు ఖర్చయ్యాయి. కానీ.. పూర్తయిన పనులకు, చేసిన వ్యయానికి ఏమాత్రం పొంతన లేదనే విమర్శలొస్తున్నాయి. నాలా తవ్వుతుంటే బండరాళ్లు అడ్డొచ్చాయని, గుట్టలను తొలగించామని, ఎక్కువ ఇనుము వాడామని.. కొందరు ఇంజినీర్లు భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు స్థానికులు గగ్గోలుపెడుతున్నారు. రాంనగర్‌, సికింద్రాబాద్‌, బాగ్‌లింగంపల్లి, తదితర ప్రాంతాల్లో నాలా పనులు.. ఆశించిన ఫలితం ఇవ్వట్లేదని వాపోతున్నారు.

నాలా సేఫ్టీ ఆడిట్‌ పేరుతోనూ అవినీతి..

 కొన్నేళ్ల కిందట మల్కాజిగిరిలోని ఓ వీధిలో ఆడుకుంటున్న చిన్నారి నాలాలో పడి, పక్కనున్న బండ చెరువులో శవమై తేలి ంది. దానిపై నగరవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. పరిస్థితిని అదుపు చేయడంలో భాగంగా నాలాల పొడవునా సేఫ్టీ ఆడిట్‌ చేపడతామని, ఓపెన్‌ నాలాలను గుర్తించి పైకప్పు లేదా జాలీలను ఏర్పాటు చేస్తామని, నాలా ప్రమాదాలను నియంత్రిస్తామని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. అయితే.. సేఫ్టీ ఆడిట్‌ మొక్కుబడిగా మారింది. ఈ ఏడాదిలో చేపట్టిన సేఫ్టీ ఆడిట్‌ నత్తనడకన సాగుతోంది. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడంలో అధికారులు, ప్రైవేటు కన్సల్టెన్సీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. బేగంపేట నాలా మీదుగా వెళ్లే రైల్వే ట్రాకు వద్ద జీహెచ్‌ఎంసీ భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లనే మంగళవారం రాత్రి నాలా ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు వాపోయారు.
 నాలాల పూడికతీత మే మొదటి వారానికి పూర్తవ్వాలి. పనులు అయ్యింది మాత్రం 54శాతమే. 952.71కి.మీ నాలాల్లో 3.8లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలను రూ.56.38కోట్లతో వెలికి తీయాలని జోన్లవారీగా పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 2.09క్యూబిక్‌ మీటర్ల పూడికతీత మాత్రమే జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని