logo

ఇంజినీర్లకు దావత్‌ తెచ్చిన తంటా

మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ఎల్బీనగర్‌లో నిర్వహించిన ఓ దావత్‌కు కొందరు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు హాజరైన ఉదంతంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సుమారు 10 మంది అధికారులకు మెమో జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Published : 09 May 2024 02:36 IST

ఎన్నికల సంఘం తాఖీదు

ఈనాడు, హైదరాబాద్‌: మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ఎల్బీనగర్‌లో నిర్వహించిన ఓ దావత్‌కు కొందరు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు హాజరైన ఉదంతంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సుమారు 10 మంది అధికారులకు మెమో జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్‌ 16న స్థానిక ఈశ కన్వెన్షన్‌ హాల్‌లో భారాసకు మద్దతుగా జరిగిన వేడుకకు కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్‌, డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు విజయ్‌కుమార్‌, డిప్యూటీ ఇంజినీరు దామోదర్‌ తదితరులు పాల్గొన్నారంటూ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు వెళ్లింది. ఆయన తగు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ)కి ఆదేశాలిచ్చారు. డీఈఓ మెమోలు జారీ చేశారని, మెమోలకు అధికారులంతా వివరణ ఇచ్చారని సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు. గుత్తేదారు పుట్టిన రోజు వేడుకకు కొందరు ఇంజినీర్లు హాజరవగా, ఆ వేడుకకు రాజకీయాన్ని ఆపాదించి ఉద్దేశపూర్వకంగా తమపై ఫిర్యాదు చేశారన్నారు. ఆ రోజున కేంద్ర కార్యాలయంలోని సమావేశంలో ఉన్న అధికారుల పేర్లనూ జోడించారని గుర్తుచేశారు. అదే విషయాన్ని తగిన ఆధారాలతో డీఈఓకు సమాధానంగా ఇచ్చామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని