logo

సన్నద్ధత కరవై.. గాలిలో దీపమై

ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ శాఖల సన్నద్ధత లోపంతో నగరంలో కొన్ని వేల మందికి మంగళవారం కాళరాత్రిగా మారింది.

Updated : 09 May 2024 04:08 IST

1500 విద్యుత్తు ఫీడర్లలో అంతరాయాలు..

చెట్లు కూలిన చోట పునరుద్ధరణకు కొన్ని ప్రాంతాల్లో  26 గంటలు

హుడాకాలనీలో విద్యుత్తు అధికారులకు ఫిర్యాదు చేస్తున్న కాలనీలవాసులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ శాఖల సన్నద్ధత లోపంతో నగరంలో కొన్ని వేల మందికి మంగళవారం కాళరాత్రిగా మారింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పోయిన కరెంట్‌.. కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం, మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత కానీ పునరుద్ధరించలేకపోయారు. మియాపూర్‌ బాలాజీనగర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కరెంట్‌ వచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 26గంటల పాటు కరెంట్‌ లేకపోవడంతో నరకం చవిచూశారు.

 అకాల వర్షాలను విస్మరించారు..  వేసవిలో కురిసే అకాల వర్షం, ఈదురుగాలులతో తలెత్తే సమస్యలను డిస్కం విస్మరించింది.  భారీ గాలులకు చెట్లు, కొమ్మలు, ఫ్లెక్సీలు పెద్దఎత్తున 11కేవీ, 33కేవీ లైన్లపై పడటంతో  సరఫరాకు అంతరాయం కలిగింది. 100 వరకు ఉపకేంద్రాల్లో అంధకారం నెలకొంది. దాదాపు 1500 ఫీడర్ల వరకు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు డిమాండ్‌ 3900 మెగావాట్ల నుంచి ఒక్కసారిగా వెయ్యి మెగావాట్లకు పడిపోయింది. అర్ధరాత్రి వరకు 1371 ఫీడర్లను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.

 విద్యుత్తు కార్యాలయం ముట్టడి..

చందానగర్‌: చందానగర్‌ హుడాకాలనీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  బుధవారం మధ్యాహ్నం వరకూ  చాలా కాలనీల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించలేక పోయారు. కరెంట్‌ లేక బోర్లు పనిచేయక తాగునీటికి బస్తీలవాసులు అవస్థలు పడ్డారు. దీంతో సాయంత్రం కార్యాలయానికి కాలనీవాసులు భారీగా చేరుకొని ఆందోళన వ్యక్తంచేశారు.

వర్షం సమయంలో తగ్గిన సిటీ బస్సులు

మంగళవారం కురిసిన వర్షం సమయంలో కొన్ని మార్గాల్లో సిటీ బస్సులు తిరగలేదని ప్రయాణికులు వాపోయారు. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ జామ్‌లతో కొన్ని ఇరుక్కోగా.. మరికొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడినందున మరికొన్ని సర్వీసులు రద్దు చేశారు. వర్షం ఆరంభంలో ఉన్న సర్వీసులన్నీ.. గమ్యస్థానానికి వెళ్లి అక్కడే ఆగిపోయాయి.

ఆగిన తాగునీటి సరఫరా

ఈనాడు, హైదరాబాద్‌: ఈదురు గాలులు, వర్షానికి విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగడంతో  గ్రేటర్‌ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా మంజీరా పంపింగ్‌ స్టేషన్ల వద్ద గాలులకు చెట్లు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో సరఫరా నిలిచిపోయింది.దీంతో 40 ఎంజీడీల నీటి సరఫరా ఆగిపోయింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడంతో నీటి పంపింగ్‌ను ప్రారంభించారు. సాయంత్రం నుంచి గ్రేటర్‌లోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాను అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని